సందీప్ కిషన్ 30.. మరో క్రేజీ కాంబో షురూ
డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జే దర్శకత్వం వహిస్తున్న వైబ్ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నిర్మిస్తున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇటీవల ఊరు పేరు భైరవకోన చిత్రంతో మంచి హిట్ కొట్టిన ఆయన.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల సూపర్ హిట్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మేకర్స్ తో చేతులు కలిపారు. డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జే దర్శకత్వం వహిస్తున్న వైబ్ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతోపాటు తమిళ- తెలుగు ద్విభాషా చిత్రం మాయావన్ షూటింగ్ ను స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు సందీప్ కిషన్. 2017లో వచ్చిన ప్రాజెక్ట్-జెడ్ కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించనున్నారు. టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తుండగా.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సూపర్ హిట్ ఫ్రాంచైజీ ది ఫ్యామిలీ మ్యాన్ మూడో పార్ట్ లో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ కమాండర్ రోల్ లో ఆయన నటించనున్నారని సమాచారం. అయితే కొన్ని రోజుల క్రితం, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ ఓ సినిమా చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో మంగళవారం ఉదయం సందీప్ కిషన్- త్రినాథ రావు నక్కిన ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు మేకర్స్. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 2025లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. సినిమాలోని నటీనటుల వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
మరోవైపు, ఊరు పేరు భైరవకోన సినిమా తర్వాత తన రెమ్యునరేషన్ ను సందీప్ కిషన్ పెంచారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటూ ప్రస్తుతం సందీప్ కిషన్ బిజీగా గడుపుతున్నారు. మరి వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ తో ఈ యంగ్ హీరో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్లు అందుకుంటారో వేచి చూడాలి.