సుహాస్.. ఆ గొర్రెతో టెన్షన్ ఎందుకు?
అయితే, 'జనక అయితే గనక' ఇంకా విడుదల కాకుండానే సెప్టెంబర్ 20న సుహాస్ మరొక చిత్రం గొర్రె పురాణం కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
సినిమాల విడుదల తేదీల్లో సరైన ప్రణాళికలు లేకపోతే ఏ హీరోకైనా ప్రతికూలతలు ఎదురవుతాయి. ఇటీవలే రాజ్ తరుణ్ వారం రోజుల వ్యత్యాసంలో రెండు సినిమాలను విడుదల చేసి, మార్కెట్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పురుషోత్తముడు, తిరగబడరా సామీ' చిత్రాలు వారం గ్యాప్ లోనే విడుదలయ్యాయి కానీ రెండూ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి.
ఒకే హీరో సినిమాలు చాలా తక్కువ గ్యాప్‌లో విడుదలవ్వడం రిస్క్ అనే వాదన ఉంది. ఇప్పుడు అదే పంథాలో సుహాస్ కూడా ముందుకు సాగుతున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో వచ్చిన 'జనక అయితే గనక' సెప్టెంబర్ 7న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
కండోమ్ కంపెనీ మీద కేసు పెట్టే డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అయితే, 'జనక అయితే గనక' ఇంకా విడుదల కాకుండానే సెప్టెంబర్ 20న సుహాస్ మరొక చిత్రం గొర్రె పురాణం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక్కడే ఆందోళన మొదలవుతుంది. రెండవ సినిమా విడుదలకు కేవలం రెండు వారాల మాత్రమే గ్యాప్ ఉండటం, అది కూడా పెద్ద హీరోల సినిమాల మధ్యలో రావడం వ్యాపారపరంగా సమస్యను తలపెట్టే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ అవ్వబోతుంది. అప్పుడు సుహాస్ సినిమాలైన 'జనక అయితే గనక' లేదా 'గొర్రె పురాణం' కి థియేటర్లలో నిలదొక్కుకునే అవకాశం దక్కుతుందా అనే సందేహం మార్కెట్ వర్గాల్లో ఉంది. మరొక కీలకమైన అంశం ఏమిటంటే, సుహాస్ రైటర్ పద్మభూషణ్' తరువాత వరుస సినిమాలు ఒప్పుకున్నాడు. దీంతో ఆయన చేతిలో చాలా ప్రాజెక్టులు ఉండటంతో, షూటింగ్ షెడ్యూల్స్ మరియు విడుదల తేదీలను సెట్ చేయడం కొంత కష్టంగా మారింది.
ఈ పరిస్థితుల కారణంగా 'జనక అయితే గనక' మరియు గొర్రె పురాణం సినిమాలు ఒకే నెలలో విడుదల కానున్నాయి. సుహాస్ ఇప్పుడు ఫుల్ స్పీడ్లో సినిమాలు చేస్తుండటం అభిమానులకు ఆనందం కలిగిస్తున్నప్పటికీ, పెద్ద హీరోలు కూడా మార్కెట్‌లో నిలబడేందుకు శ్రద్ధ చూపాల్సిన పరిస్థితుల్లో సుహాస్ సినిమాలు ఎలా ప్రదర్శిస్తాయో వేచి చూడాలి. కీర్తి సురేష్ తో కలిసి ఉప్పు కప్పురంబు సినిమా కూడా చేస్తుండటంతో, సుహాస్‌కు టాలీవుడ్‌లో రాబోయే రోజుల్లో మరిన్ని మంచి అవకాశాలు ఉండవచ్చన్నది స్పష్టంగా కనిపిస్తుంది.