ఈ కాంబో ప్రమాదమే రాజా..?
మాస్ మహారాజా రవితేజ తన సినిమా ఫలితాల గురించి పెద్దగా పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మాస్ మహారాజా రవితేజ తన సినిమా ఫలితాల గురించి పెద్దగా పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2022లో విడుదలైన 'ధమాకా' ఆయనకు మంచి హిట్ అందించింది. ఆ సినిమా తర్వాత 'వాల్తేరు వీరయ్య' లో నటించినప్పటికీ, ఆ విజయానికి ప్రధాన క్రెడిట్ చిరంజీవికి వెళ్లింది. 'ధమాకా' తర్వాత వచ్చిన 'రవణాసుర,' 'టైగర్ నాగేశ్వరరావు,' మరియు 'ఈగల్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాలను చవిచూశాయి.
ఆయన చివరి సినిమా 'మిస్టర్ బచ్చన్' కూడా ఘోర అపజయం సాధించింది. ఇటీవల రవితేజ తన కొత్త సినిమా RT 75 షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా మేరకు రవితేజ గత కొన్ని వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే ఈ విరామ సమయంలో రవితేజ కొత్త కథలను వింటున్నారని టాక్. అందుతున్న మరో సమాచారం ప్రకారం, తమిళ దర్శకుడు సుందర్.సి రవితేజకు ఓ కథను వినిపించారని, ఆ కథ రవితేజకు నచ్చిందని టాక్.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి రవితేజ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సుందర్ సి తమిళంలో పాపులర్ డైరెక్టర్. ఆయన రజనీకాంత్‌తో 'అరుణాచలం (1997)' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసారు. అయితే, గత కొంత కాలంగా సుందర్ సి ఫ్లాప్‌లతోనే ఉన్నారు. 'అరణ్మనై' సిరీస్ తప్ప ఆయన చేసిన ఇతర చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు.
అంతే కాకుండా రెగ్యులర్ ఫార్మాట్ లో హారర్ కామెడీ సినిమాలు చేస్తున్నారు. అలాంటి కాన్సెప్టులతో ఎప్పటికైనా కాస్త రిస్క్ తో కూడుకున్న పని. మరి, రవితేజ సుందర్ సి దర్శకత్వంలో సినిమా చేస్తాడా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇక, రవితేజ ప్రస్తుతం RT 75 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు.
సితార ఎంటర్టైన్‌మెంట్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం గురించి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. రవితేజ గాయపడటంతో ఈ చిత్రం విడుదలపై మరింత ఆసక్తి నెలకొంది. రవితేజ గత కొన్ని సినిమాల్లో పెద్దగా విజయం సాధించకపోయినా, ఆయన మాస్ ఫాలోయింగ్ తగ్గలేదు. 'ధమాకా' వంటి హిట్ సినిమా తర్వాత వచ్చిన ఫ్లాప్స్ కూడా ఆయన కెరీర్‌ను అంతగా ప్రభావితం చేయలేదు. రవితేజకు సరైన కథ దొరికితే, ఆయన తిరిగి ఫాంలోకి రావడం ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే, ఆయన ఈసారి చేయబోయే కథ ఎలా ఉండబోతుందన్నది అత్యంత కీలకంగా మారింది.