టీజర్ ట్రైలర్: అదరగొట్టిన నయా సూపర్‌మేన్
సూపర్‌మేన్ ఫ్రాంఛైజీ నుంచి సినిమా రిలీజవుతోంది అంటే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ పండగే.
సూపర్‌మేన్ ఫ్రాంఛైజీ నుంచి సినిమా రిలీజవుతోంది అంటే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ పండగే. భారీ పోరాటాలు, అసాధారణ సాహసవిన్యాసాలు, గగుర్పాటుకు గురి చేసే యాక్షన్ ని తెరనిండుగా వీక్షించవచ్చు. ముఖ్యంగా ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌పై 3డి విజువల్స్ చూస్తున్నంత సేపూ అసలు టైమ్ అన్నదే తెలియదు. అంత ప్రభావవంతంగా తెరకెక్కిస్తారు గనుకనే డీసి యూనివర్శ్ ఫ్రాంచైజ్ నుంచి జేమ్స్ గన్ రూపొందిస్తున్న కొత్త `సూపర్‌మేన్` రాక కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా వేచి చూస్తోంది. ఒకరోజు ముందే టీజర్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నామని జేమ్స్ గన్ అధికారిక సోషల్ మీడియాలో వెల్లడించడంతో అందరూ ఉత్కంఠగా వేచి చూసారు.
ఎట్టకేలకు సూపర్‌మేన్ టీజర్ ట్రైలర్ రానే వచ్చింది. 2ని.ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టించింది. సూపర్ మేన్ సినిమాల ప్రామాణికతకు ఇది సింబల్ గా కనిపించింది. నిజానికి టైటిల్ పాత్రధారి డేవిడ్ కోరెన్స్‌వెట్ షైనింగ్ సూపర్‌మ్యాన్ ఉదయించాడు. టీజర్ ట్రైలర్ `మ్యాన్ ఆఫ్ స్టీల్` కంటే భిన్నంగా రక్తి కట్టించింది. పాత సూపర్ మేన్ వాసనలకు కొంత దూరంగా ఆకర్షణీయంగా కొత్త సూపర్‌మేన్‌ని మలచడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఒక చిన్న గ్రామంలో మొదలై .. ప్రపంచ రక్షకునిగా మారే వరకు సూపర్‌మ్యాన్ ప్రయాణం టీజర్ ట్రైలర్ లో చూపించారు. క్రిప్టో సూపర్ డాగ్‌తో సూపర్‌మేన్ అనుబంధం .. లోయిస్ లేన్ (రాచెల్ బ్రోస్నాహన్)తో అతని సంబంధాన్ని టీజర్ లో ఆవిష్కరించారు. గతంలో హెన్నీ కావిల్ సూపర్ మేన్ గా నటించగా, ఈసారి సూపర్ మేన్ రీబూట్ లో డేవిడ్ కొరెన్స్‌వెట్‌ను టైటిల్ రోల్‌లో పరిచయం చేసారు.
గత రెండు దశాబ్దాలలో సూపర్‌మ్యాన్ ఫ్రాంచైజీని మూడవసారి రీబూట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. యూనివర్స్ నుంచి మరో క్లాసిక్ సినిమా రాబోతోందని ఈ టీజర్ ట్రైలర్ నిరూపించింది. జేమ్స్ గన్ సూపర్‌మ్యాన్ కొత్త DC యూనివర్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఇది హెన్రీతో తీసిన డిసిఇయు సూపర్‌మేన్ సిరీస్ లకు భిన్నంగా ఉంటుందని ఆశిస్తున్నారు. జేమ్స్ గన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 11 జూలై 2025న విడుదల కానుంది.