కంగన ఒక వేశ్య.. ఇదిగో ఫైర్‌బ్రాండ్ కౌంటర్!
సోమవారం ఉదయమే కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే కంగనను వేశ్య అని విమర్శిస్తూ చేసిన అభ్యంతరకర పోస్ట్ ప్రకంపనాలు సృష్టించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోక్‌సభ అభ్యర్థిగా కంగనా రనౌత్ ఉ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదో స్పెల్ లో భాజపా తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే కంగన తన ఆనందం వ్యక్తం చేస్తూ తాను కూడా పార్టీ కార్యకర్తగా పని చేస్తున్నానని తెలిపారు. ఇంతలోనే కంగనపై ప్రత్యర్థుల దాడి మొదలైంది. సోమవారం ఉదయమే కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే కంగనను వేశ్య అని విమర్శిస్తూ చేసిన అభ్యంతరకర పోస్ట్ ప్రకంపనాలు సృష్టించింది.
కంగన ప్రత్యర్థి వ్యాఖ్యలపై స్పందిస్తూ, ``ప్రతి మహిళ ఆత్మ గౌరవానికి అర్హురాలు`` అని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు 111 మంది అభ్యర్థులతో కూడిన ఐదవ జాబితాను బిజెపి విడుదల చేయగా కంగనా రనౌత్ కి తన జన్మస్థలమైన మండి నుండి ఎన్నికల్లో అరంగేట్రానికి అవకాశం లభించింది. కంగన సోషల్ మీడియాల్లో తనను విమర్శించిన వారికి ఇలా కౌంటర్ వేసారు. ప్రత్యర్థిని గారు అని గౌరవిస్తూనే పంచ్ లు విసిరారు. కంగన వ్యాఖ్యానిస్తూ..``ప్రియమైన సుప్రియా జీ, ఆర్టిస్ట్‌గా నా గత 20 ఏళ్ల కెరీర్‌లో నేను అన్ని రకాల మహిళల పాత్రలను పోషించాను. క్వీన్‌లోని అమాయక అమ్మాయి నుండి ధాకడ్‌లోని సమ్మోహన గూఢచారి వరకు, మణికర్ణికలోని వీరనారి నుండి చంద్రముఖిలోని రాక్షసి వరకు, రజ్జోలోని వేశ్య నుండి తలైవిలో విప్లవ నాయకురాలి వరకు ప్రతి పాత్రలో నటించాను. మనం మన కుమార్తెలను పక్షపాతాల సంకెళ్ల నుండి విడిపించాలి. వారి శరీర భాగాల పట్ల ఉత్సుకత కంటే పైకి ఎదగాలి. అన్నింటికంటే మించి సెక్స్ వర్కర్ల జీవితాలను లేదా వారి పరిస్థితులను దుర్వినియోగం లేదా దూషణగా ఉపయోగించడం మానుకోవాలి. ప్రతి స్త్రీ తన గౌరవానికి అర్హమైనది! అని కంగనా ఎక్స్ పోస్ట్‌లో రాసింది.
సుప్రియ ఏం పోస్ట్ చేసింది?
కంగనా లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ``క్యా భావ్ చల్ రహా హై మంది మే కోయి బటాయేగా?`` అనే శీర్షికతో కంగన ఫోటోని షేర్ చేసింది. మండిలో రేట్లు ఎవరైనా చెబుతారా? అంటూ కంగనను వేశ్యగా అభివర్ణించింది. అయితే ఆమె ఆ పోస్ట్‌ని తర్వాత తొలగించారు. సుప్రియా శ్రీనాట్ దీనిని తన ఖాతాకు యాక్సెస్ ఉన్న వ్యక్తి పోస్ట్ చేసారని స్పష్టం చేసింది. నేను ఒక మహిళ విషయంలో అలా అనను అని నా గురించి తెలిసిన వారికి తెలుసు అని వివరణ ఇచ్చుకుంది.
``నా మెటా ఖాతాలకు (FB , Insta) యాక్సెస్ ఉన్న ఒకరు పూర్తిగా అసహ్యకరమైన అభ్యంతరకరమైన పోస్ట్‌ను పోస్ట్ చేసారు. అది తీసివేసాను. నా గురించి తెలిసిన ఎవరికైనా నేను ఒక స్త్రీ గురించి అలా అననని తెలుసు. అయితే నా పేరును దుర్వినియోగం చేస్తున్నట్లు నేను కనుగొన్న ఒక పేరడీ ఖాతా ట్విట్టర్‌లో (@Supriyaparody) రన్ అవుతోంది. ఈ ఖాతాలో దుశ్చర్యను ప్రారంభించారు`` అని సుప్రియా రాసారు.
అయితే కంగన వేశ్య అని ఎత్తి చూపిన పోస్ట్ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానిస్తూ-``ఉక్కు లాంటి మహిళలతో ఎలా వ్యవహరించాలో వారు (ప్రతిపక్ష నాయకులు) అర్థం చేసుకోలేకపోతున్నారు?`` అని మండిపడ్డారు. కంగన విజయం దిశగా సాగిపోతోంది... విజయీ భవ! అని కూడా స్మృతి ఇరానీ బాసటగా నిలిచారు.