మా కుటుంబానికి సంబంధం లేదు :అల్లు అరవింద్
ప్రముఖ మూవీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి గత కొన్ని సంవత్సరాలుగా 'సంతోషం ఫిలిం అవార్డ్స్' వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ప్రముఖ మూవీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి గత కొన్ని సంవత్సరాలుగా 'సంతోషం ఫిలిం అవార్డ్స్' వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది గోవాలో ఈ వేడుకలు నిర్వహించారు. డిసెంబర్ 2న జరిగిన ఈ అవార్డుల ఫంక్షన్ కి తెలుగుతోపాటు కన్నడ సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే ఈ వేడుకను నిర్వహించడంలో నిర్వాహకులు విఫలమైనట్లు పలు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ వేడుకకు కన్నడ సినీ ప్రముఖులను పిలిపించి అవమానించారంటూ కన్నడ ఇండస్ట్రీ నుంచి పలువురు టాలీవుడ్ పై మండి పడుతున్నారు. ఇది కాస్త ఇప్పుడు వివాదంగా మారింది. కొన్ని వార్తా సంస్థలు అయితే మెగా, అల్లు ఫ్యామిలీకి సురేష్ కొండేటి పీ ఆర్ గా వ్యవహరిస్తున్నారని కూడా రాసుకొచ్చాయి. దీంతో తాజాగా ఇదే వివాదంపై అల్లు అరవింద్ స్పందిస్తూ సోమవారం విలేకరులతో మాట్లాడారు.
" ఒక జర్నలిస్ట్ ఎన్నో సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తూ ఈసారి గోవాలో ఆ ఫంక్షన్ జరపాలని అనుకున్నాడు. ఏదో కొన్ని కారణాలవల్ల ఫెయిల్ అయ్యాడు. అక్కడికి వెళ్ళినవారు ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంలో మీడియా మా కుటుంబానికి చెందిన వ్యక్తులకు పీఆర్వో అని రాస్తున్నారు. దీంతో మా పీఆర్వో కు కాల్ చేసి ఆయన పీఆర్ఓ అని ఆఫీషీయల్ చెప్పారా? అని అడిగాను. ఎప్పుడైనా ఫోటోల కోసం, ఏదైనా సందర్భంలో ఆయన కలిసినప్పుడు పిఆర్ఓ అని పేర్కొనడం కరెక్ట్ కాదు.
" అతను ఇండివిజువల్ గా ఏదో చేసుకున్నాడు. ఫెయిల్ అయ్యాడు. ఇతర భాషల వాళ్ళకి ఇబ్బందులు కలగాయి. వాళ్లు కూడా తెలుగు ఇండస్ట్రీ విమర్శిస్తున్నారు. అది ఒక వ్యక్తి చేసిన తప్పిదం. తెలుగు ఇండస్ట్రీలో మనసులు ఇంతే అంటూ వాళ్ళు మాట్లాడ్డాన్ని చూసి బాధ కలిగింది. ఒక వ్యక్తి చేసిన దానికి ఎవరికో ఆపాదించడం, అది తెలుగు ఇండస్ట్రీకి ఆపాదించడం మంచిది కాదు. ఆయన మా కుటుంబంలో ఎవరికీ పిఆర్ ఓ కాదు. అది ఆయన పర్సనల్ ఫెయిల్యూర్ మాత్రమే. దాన్ని తెలుగు ఇండస్ట్రీ మీదకు తీసుకురావద్దని కోరుతున్నాను" అని తెలిపారు.
తాజాగా ఇదే విషయంపై స్వయంగా సురేష్ కొండేటి ట్విట్టర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.." అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే .. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను.
" గోవా ఈవెంట్ లో జరిగిన కొంచం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్ కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్ లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్ , అది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి" అంటూ రాసుకొచ్చారు.