అండమాన్ లో ముగించి ఊటికెళ్తున్నారా?
సూర్య కథానాయకుడిగా 44వ చిత్రం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే
సూర్య కథానాయకుడిగా 44వ చిత్రం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రారంభమైంది. అక్కడ సూర్య హీరోయిన్ పూజాహెగ్డేపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సూర్యపై కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఇద్దరి పై రెండు పాటల చిత్రీకరణ కూడా ముగించారు. ప్రస్తుతం ప్రధాన తారా గణంపై మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
రెండు మూడు రోజుల్లో అవి కూడా పూర్తవుతాయని సమాచారం. జులై తొలి వారానికల్లా మొదటి షెడ్యూల్ ముగుస్తుందని చిత్ర వర్గాల సమాచారం. అటుపై ఊటీలో రెండవ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇది లాంగ్ షెడ్యూల్ అట. నెల రోజుల పాటు ఊటీలోనే షూటింగ్ చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇందులో ప్రధానంగా సూర్య, ప్రతి నాయకుడి బృంధంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట.
ప్రేమ, యాక్షన్, వినోదం అంశాల్ని ఆధారంగా చేసుకుని కార్తీక్ రాసుకున్న కథ ఇది. సూర్య ఈ చిత్రాన్ని సైలెంట్ గా పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. `కంగువ` షూటింగ్ పూర్తయిన తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే సుబ్బరాజ్ ని లైన్ లోకి తెచ్చారు. చాలా మంది దర్శకులు కథలు వినిపించినా సుబ్బరాజ్ కథకే సూర్య కనెక్ట్ అయి ముందుగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు.
కార్తీక్ సుబ్బరాజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలాంటి వేగానికి సూర్య లాంటి స్టార్ దొరికితే ఎలా ఉంటుందో? చెప్పాల్సిన పనిలేదు. అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అటు సూర్య నటించిన పీరియాడిక్ చిత్రం `కంగువ`పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఆ చిత్రం పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది.