వాళ్లెందుకివ్వ‌రు థియేట‌ర్లు ఎవ‌రూ ప్ర‌శ్నించ‌రా?

ఇప్పుడింకా మ‌రింత వేగ‌వంతంగా త‌మిళ సినిమాకి థియేట‌ర్లు దొరుకుతున్నాయి.

Update: 2024-11-07 12:30 GMT

త‌మిళ హీరోల సినిమాలు తెలుగు లో ఏ రేంజ్ రిలీజ్ అవుతాయో చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు స్టార్ హీరోల సినిమా లున్నా స‌రే స‌ర్దుబాటు చేసి మ‌రీ త‌మిళ సినిమాకి థియేట‌ర్లు ఇస్తారు. తెలుగు సినిమాల‌కు థియేట‌ర్లు త‌క్కువ‌గా ఉన్నా స‌రే త‌మిళ సినిమా అనే స‌రికి ముందుకొచ్చి స‌ర్దుబాటు చేసి మ‌రీ ఇవ్వడం తెలుగు వాళ్ల‌కే సాధ్య‌మైంది. ఇది ఇప్ప‌టి నుంచి కాదు. కొన్ని ద‌శాబ్ధాలుగా ఇదే విధానం కొన‌సాగుతుంది. ఇప్పుడింకా మ‌రింత వేగ‌వంతంగా త‌మిళ సినిమాకి థియేట‌ర్లు దొరుకుతున్నాయి.

ఇక అక్క‌డ హీరోల‌కు టాలీవుడ్ ఎప్పుడూ గ్రాండ్ గా వెల్కమ్ చెబుతుంది. ఇక్క‌డి స్టార్లు అంతా క‌లిసి వాళ్ల సినిమా ఎంచ‌క్కా ప్రమోట్ చేస్తారు. త‌ద్వారా కోట్ల రూపాయ‌ల ప‌బ్లిసిటీ త‌మిళ సినిమా కి ఆ రూంప‌లో ఉచితంగానే ద‌క్కుతుంది. అలాగే టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కోలీవుడ్ హీరోల‌కు అంతే నీరాజనాలు ప‌లుకుతారు. త‌మిళ హీరోల్ని తెలుగులో లాంచ్ చేయ‌డానికి ఇక్క‌డ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు పోటీ ప‌డుతుంటారు. ఇప్ప‌టికే విజ‌య్ వార‌సుడు సినిమాతో తెలుగులో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన 'అమ‌ర‌న్' త‌మిళ సినిమాకు తెలుగులో పెద్ద ఎత్తున థియేట‌ర్లు దొరికాయి. ఈ సినిమాతో పాటే 'క‌' అనే సినిమాకి త‌మిళ‌నాడు లో థియేట‌ర్లు అడిగితే? వాళ్లెమ‌న్నారో తెలుసా? మేము ఇవ్వం పోండి అన్న‌ట్లే వైఖ‌రి బ‌య‌ట ప‌డింది. ప‌ది థియేట‌ర్లైనా ఇస్తే బాగుండ‌ని హీరో ఎంతో ఆశించాడు..కానీ ఒక్క థియేట‌ర్ కూడా ఇవ్వ‌లేదు. తెలుగు సినిమాకి ఇలాంటి అన్యాయం త‌మిళ నాట ఇప్పుడు కాదు. చాలా కాలంగా జ‌రుగుతూనే ఉంది.

పాన్ ఇండియా సినిమా బాహుబ‌లి చిత్రానికే ఎక్కువ థియేట‌ర్లు అక్క‌డ దొర‌క‌లేదు. అంత‌కు ముందు ఆ త‌ర్వాత ప‌లువురు తెలుగు స్టార్ హీరోల సినిమాలు అక్క‌డ రిలీజ్ అయ్యాయి. అప్పుడు కూడా భారీ మొత్తంలో థియేట‌ర్లు దొర‌కిందిలేదు. ఏదో అర‌కొర‌గా రిలీజ్ అయ్యాయి. అక్క‌డ తెలుగు సినిమా భారీ వ‌సూళ్లు తెచ్చిన ఘ‌న‌త కూడా ఇంత‌వ‌ర‌కూ ఏ తెలుగు సినిమాకి లేదు.

మ‌రి తెలుగు సినిమాకి త‌మిళ‌నాడులో థియేట‌ర్లు ఎందుకివ్వ‌రు? అని ఏ నిర్మాత అయినా అడిగాడా? ఏ హీరో అయినా దీనిపై ఏనాడైనా స్పందిచాడా? ఏ ద‌ర్శ‌కుడైనా ఇదేం అన్యాయం అని ప్ర‌శ్నించాడా? ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల మండ‌ళ్లు ఉన్నాయి? అవి ఎప్పుడైనా స్పందించాయా? తెలుగు సినిమాకి త‌మిళ‌నాట ఈ అన్యాయం ఎందుకు జ‌రుగుతుంద‌ని ఎవ‌రైనా గొంతెత్తారా? అంటే వీటిలో దేనికి స‌మాధానం ఉండ‌దు.

Tags:    

Similar News