క‌మిటీలు వేసి ప్ర‌భుత్వం సాధించిందేంటి?

తాజాగా ఈ క‌మిటీ నివేదిక‌ను ఉద్దేశించి మాజీ బాలీవుడ్ న‌టి త‌ను శ్రీద‌త్తా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Update: 2024-08-22 00:30 GMT

మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ లైంగిక వేధింపుల‌కు సంబంధించి జ‌స్టిస్ హేమ క‌మిటీ ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన నివేదిక సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. నివేదిక‌లో నివ్వెర పోయే విష‌యాలెన్నో బ‌య‌ట ప‌డ్డాయి. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ లో ఇంత దారుణ‌మైన కీచ‌కులు ఉన్నారా? అని దేశ‌మంతా చ‌ర్చించుకునే ప‌రిస్థితి త‌లెత్తింది. తాజాగా ఈ క‌మిటీ నివేదిక‌ను ఉద్దేశించి మాజీ బాలీవుడ్ న‌టి త‌ను శ్రీద‌త్తా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

'ఈ కొత్త నివేదిక‌తో ఉప‌యోగం ఏంటి? వారు చేయాల్సింద‌ల్లా నిందితుల్ని అరెస్ట్ చేయ‌డం? ప‌ఠిష్ట‌మైన శాంతి భ‌ద్ర‌తుల‌ను అమ‌లు చేయ‌డం. గ‌తంలో ప‌ని ప్ర‌దేశాల్లో జ‌రిగే లైంగిక వేధింపుల‌కు సంబంధించి విశాఖ పేరుతో ఓ క‌మిటీ వేసారు. ఆ క‌మిటీ విచార‌ణ జ‌రిపి మార్గ‌ద‌ర్శ‌కాలు అంటూ పేజీల కొద్ది కొత్త నివేదిక రూపొందించింది. కానీ త‌ర్వాత ఏం జ‌రిగింది? కేవ‌లం క‌మిటీల పేర్లు మారాయంతే? వాటా వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం క‌నిపించ‌లేదు' అని ఆవేద‌న చెందింది.

అలాగే మ‌రోసారి నానా ప‌టేక‌ర్ పై మండిప‌డింది. 'నానా ప‌టేక‌ర్, దిలీప్ లాంటి వారు మాన‌సిక రోగులు. వారికి ఎలాంటి చికిత్స ఉండ‌దు. ఇలాంటి దుర్మార్గులే లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతుంటారు. ఈ వ్య‌వ‌స్థ‌పై నాకు న‌మ్మ‌కం లేదు. ఇలాంటి క‌మిటీలు, నివేదిక‌ల‌తో పాల‌కులంతా అస‌లు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌కుండా స‌మ‌యాన్ని వృద్ధా చేస్తున్నారు. క‌మిటీలు వేసి ప్ర‌భుత్వాలు ఏలాంటి న్యాయం చేస్తున్నాయో చెప్పాలి.

ప‌ని ప్ర‌దేశంలో భ‌ద్ర‌త అనేది ప్ర‌తీ మ‌హిళ‌, ప్ర‌తీ మ‌నిషి యోక్క ప్రాధ‌మిక హ‌క్కు. మ‌రి ఈ హ‌క్కుకు న్యాయం ఎక్క‌డ జ‌రుగుతుంది. ప్ర‌భుత్వాలు ఆ హ‌క్కును కాపాడుతున్నాయా? స‌మాజం ఎటు పోతుందో ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకుంటున్నాయా? అని' ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Tags:    

Similar News