ప్రపంచం మెచ్చిన హీరో కన్నుమూత
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎన్నో కోట్ల మంది అభిమానం సొంతం చేసుకున్న హాలీవుడ్ టీవీ సిరీస్ టార్జాన్.
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎన్నో కోట్ల మంది అభిమానం సొంతం చేసుకున్న హాలీవుడ్ టీవీ సిరీస్ టార్జాన్. సుదీర్ఘ కాలంగా టార్జాన్ సిరీస్ కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా టార్జాన్ కి అభిమానులు ఉన్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి ఎంతో మంది మాటల మధ్యలో పిల్లలను టార్జాన్ అనడం మనం చూస్తూనే ఉంటాం. 1980 కిడ్స్ మొదలుకుని ఇప్పటి వరకు టార్జాన్ సిరీస్‌లతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ప్రపంచం నలుమూలలకు వెళ్లిన టార్జాన్ కోట్లాది మందికి చేరువ అయింది. సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది.
టార్జాన్ టీవీ సిరీస్ తో ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన రాన్ ఎలీ నేడు కన్ను మూశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన మృతి చెందారని అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుమార్తె కిర్‌స్టెన్ ఎలీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో ప్రతి ఒక్కరి హృదయాలు బద్దలు అయ్యాయి. ముఖ్యంగా టార్జాన్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఎలీ మరణవార్త జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక గొప్ప నటుడిని కొల్పోయాం అంటూ ఎంతో మంది ఆయన్ను మరోసారి టార్జాన్‌గా గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా రాన్ ఎలీ కుమార్తె కిర్‌స్టెన్ ఎలీ తండ్రి మరణంపై స్పందిస్తూ... నేను నా తండ్రిని కోల్పోయాను, ఈ ప్రపంచం మంచి వ్యక్తిని, మంచి నటుడిని కోల్పోయింది. అంతా ఆయన్ను హీరోగా పిలుస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ను విస్తరింపజేస్తూ ఉంటారు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, కోచ్‌గా, గురువుగా, తండ్రిగా, లీడర్‌గా తన జీవితంలో కీలక పాత్ర పోషించారు. నా పై ఆయన ప్రభావం ఎంతో మంది. నా జీవితంలో ఆయన నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాల కారణంగా విజయాలను సొంతం చేసుకున్నాను అంది.
నాన్న నా ప్రపంచం అనుకుంటూ జీవితం సాగించాను. ఆయన నా రోల్ మోడల్. ఎప్పటికీ ఆయన నా హీరో. ఎంతో ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన చెప్పేవారు. నా కోసం ఆయన ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ప్రపంచం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రతి విషయంలోనూ అద్భుతమైన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా అందరికీ న్యాయం చేసే విధంగా వ్యవహరించే వారు అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా తండ్రి ని స్మరించుకుంది. రాన్ ఎలీ మరణంపై హాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆయన లేని లోటు తీర్చలేనిదని సినీ ప్రముఖులు తమ అనుబంధం ను నెమరువేసుకున్నారు.