జానీ మాస్టర్ పుష్ప 2 సాంగ్.. ఓ క్లారిటీ!

గోవాలో కొన్ని రోజుల క్రితం అదుపులోకి తీసుకుని జానీని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జైలుకు తరలించారు.

Update: 2024-10-24 12:13 GMT

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం.. పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం.. పోలీసులు అరెస్టు చేయడం.. ఈ వ్యవహరమంతా తెలిసిందే. మహిళా కొరియోగ్రాఫర్ నుంచి ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ పోలీసులు.. గోవాలో కొన్ని రోజుల క్రితం అదుపులోకి తీసుకుని జానీని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జైలుకు తరలించారు.

సుమారు 35 రోజుల తర్వాత జానీ మాస్టర్ కు నేడు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. దీంతో మరికొన్ని గంటల్లో జైలు నుంచి బయటకు జానీ మాస్టర్ రానున్నారు. అయితే అరెస్ట్ జరిగిన చాలా రోజుల ముందే ఆయనను పుష్ప-2 ఐటెం సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా ఆ మూవీ మేకర్స్ సెలెక్ట్ చేశారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో ఆ సాంగ్ ఎవరు కంపోజ్ చేస్తారోనని కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది.

ఇప్పుడు జానీ మాస్టర్ కు బెయిల్ రావడం.. పుష్ప-2 మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టడం ఒకేసారి జరగడం యాదృచ్ఛికం. దీంతో జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చింది కదా.. మరి పుష్ప 2లో సాంగ్ ను ఆయనే కంపోజ్ చేస్తున్నారా అని మీడియా ప్రతినిధి మేకర్స్ ను ప్రశ్నించారు. అయితే ఇప్పటికే కొరియోగ్రాఫర్ ను మార్చేశామని నిర్మాతలు తెలిపారు. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నామని చెప్పారు. అలా పుష్ప-2లో జానీ సాంగ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

దీంతో జానీ మాస్టర్ కు బెయిల్ లభించినా.. ఊహించని షాక్ తగిలినట్లే. అత్యాచారం కేసు వల్ల బిగ్గెస్ట్ ఛాన్స్ ను ఆయన మిస్ చేసుకున్నారనే చెప్పాలి. అయితే ఐటెం సాంగ్ ను నవంబర్ 4 నుంచి షూట్ చేయబోతున్నట్టు మరో ప్రశ్నకు సమాధానమిస్తూ మేకర్స్ తెలిపారు. బన్నీతో ఎవరు చిందులేయనున్నారనేది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. రెండు రోజుల్లో ఆ వివరాలు ప్రకటిస్తామని అన్నారు. ఆ సాంగ్ తో పాటు కాస్త వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని తెలిపారు.

అదే సమయంలో పుష్ప- 2 మూవీ అనుకున్న తేదీ (డిసెంబర్ 6) కంటే ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 5న విడుదల కానున్నట్లు ప్రకటించారు. గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో మేకర్స్.. ప్రీ పోన్ విషయాన్ని వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి ఆ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. మరి పుష్ప-2 మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News