తెలుగు సినిమాలు Vs డబ్బింగ్ చిత్రాలు!
మంచి కంటెంట్ ఉండి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడతాయి. కాకపోతే ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ లో దీపావళికి స్టార్ హీరోల సినిమాలను పెద్దగా రిలీజ్ చెయ్యరు. ఈసారి కూడా అగ్ర కథానాయకుల సినిమాలేవీ లేవు. కానీ బాక్సాఫీస్ వద్ద పలు క్రేజీ మూవీస్ సందడి చేయబోతున్నాయి. అర డజనుకు పైనే సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వాటిల్లో మూడు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు.. నాలుగు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఒక హిందీ మూవీ కూడా ఉంది.
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "లక్కీ భాస్కర్". వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఎస్. నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికైతే ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
యువ హీరో కిరణ్ అబ్బవరం స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం "క". సుజిత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా దీపావళికే రానుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా అనిపించింది.
సత్యదేవ్, ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన ''జీబ్రా'' సినిమాని ఈ నెల 31న తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఎందుకనో చిత్ర బృందం టీజర్ లాంఛ్ చేసిన తర్వాత ప్రమోషన్స్ చేయడం లేదు. అదే సమయంలో 'లక్కీ భాస్కర్' 'క' టీమ్స్ తమ చిత్రాలను దూకుడుగా ప్రచారం చేస్తున్నారు.
కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందిన తమిళ్ డబ్బింగ్ మూవీ 'అమరన్' సినిమా దీపావళికి రానుంది. ఇందులో శివకార్తికేయన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. పండక్కి వస్తున్న కన్నడ డబ్బింగ్ సినిమా 'భగీర'. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రాన్ని సలార్ ప్రొడ్యూసర్స్ నిర్మించారు. శ్రీ మురళీ, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ రెండు డబ్బింగ్ సినిమాల మేకర్స్ ఎప్పటికప్పుడు తెలుగు కంటెంట్ ను వదులుతూ, ఇక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటించిన 'బ్రదర్' మూవీ దీపావళికి షెడ్యూల్ చేయబడింది. కెవిన్ నటిస్తున్న 'బ్లడీ బెగ్గర్' సినిమా కూడా ఇదే సీజన్ లో రానుంది. ఇప్పటికైతే ఈ రెండు తమిళ డబ్బింగ్ సినిమాలకు సంబంధించిన తెలుగు ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయలేదు. మరికొన్ని రోజుల్లో తెలుగు రిలీజ్ మీద క్లారిటీ రానుంది. ఇక 'భూల్ భూలయ్యా 3' అనే హిందీ మూవీ కూడా విడుదల కానుంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్ మల్టీఫ్లెక్స్ లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చిత్ర బృందం హైదరాబాద్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇలా దీపాల పండక్కి బోలెడన్ని సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికైతే రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకు మంచి బజ్ వుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటీనటులు, దర్శక నిర్మాతలు ఉండటం వల్ల డబ్బింగ్ సినిమాలపై కూడా దృష్టి పడింది. ఈరోజుల్లో ఏ సినిమాకైనా మౌత్ టాక్ కీలకంగా మారింది. మంచి కంటెంట్ ఉండి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడతాయి. కాకపోతే ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.