ఫిలించాంబర్ ఎన్నికల్లో యువ నిర్మాత ఓటమి షాకింగ్
మెజారిటీ ఓటర్లకు చేరువయ్యాడు కాబట్టి ఓటమి ఆశ్చర్యానికి గురి చేసింది
2023-25 సీజన్‌కి ఫిలించాంబర్ కొత్త కార్యవర్గం ఎన్నికైంది. దిల్ రాజు అధ్యక్షుడు కాగా.. ఈసీలోకి ప్రభావవంతమైన నిర్మాతలు ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేతల్లో ఒకరైన వివేక్ కూచిభొట్ల ఓటమి పాలవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన స్వతహాగా మృధు స్వభావి. వివాద రహితుడు. అందరితో కలిసిపోయి పని చేస్తుంటారు. బ్యాక్ టు బ్యాక్ తమ సంస్థలో సినిమాలు తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకుంటూ యాక్టివ్ నిర్మాతగా ఉన్నారు. కానీ పొరపాటు ఎక్కడ జరిగింది? అంటూ వివేక్ కూచిబొట్ల పరాజయంపై పరిశ్రమ ఆశ్చర్యపోతోంది.
ఈ ఎన్నికల కోసం వివేక్ దాదాపు 10 రోజుల పాటు శ్రమించారు. మెజారిటీ ఓటర్లకు చేరువయ్యాడు కాబట్టి ఓటమి ఆశ్చర్యానికి గురి చేసింది. ఓట్ల క్రమంలో వివేక్ పద్నాలుగో స్థానంలో నిలిచాడు. కేవలం పన్నెండు స్థానాలు మాత్రమే ఉండగా అతడు రేసులో వెనకబడ్డాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాకముందే చిత్రాల నిర్మాణంతో సంబంధం కలిగి ఉన్న వివేక్ కి నిర్మాతలతో సత్సంబంధాలున్నాయి. అయినా అతడు ఓటమి పాలవ్వడం ఆశ్చర్యపరిచింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన 'బ్రో' ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ - సాయిధరమ్ తేజ్ కథానాయకులుగా నటించిన బ్రో కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరిందంటూ కథనాలొచ్చాయి. ఈ సినిమాని విశ్వప్రసాద్ నిర్మించగా వివేక్ కూచిభొట్ల ఒక ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా బృహత్తర బాధ్యతల్ని చేపట్టారు. ఈ బ్యానర్ లో వరుసగా ఏడెనిమిది సినిమాలు లైనప్ లో ఉన్నాయి.