పవన్ తో విజయ్ కి పోలికలు... తెరపైకి పదేళ్ల టాపిక్!

టాలీవుడ్ లో పవర్ స్టార్ కి ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందో.. దాదాపు అదే స్థాయిలో తమిళనాట దళపతి విజయ్ కి ఉంటుందని చెబుతుంటారు.

Update: 2024-08-23 15:30 GMT

టాలీవుడ్ లో పవర్ స్టార్ కి ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందో.. దాదాపు అదే స్థాయిలో తమిళనాట దళపతి విజయ్ కి ఉంటుందని చెబుతుంటారు. గత కొంతకాలంగా ఈయన సినిమాల కలెక్షన్స్ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇక ఏపీలో పవన్ తరహాలోనే తమిళనాట విజయ్ కూడా పలు ప్రజాసమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు.

పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు దానికి నిరసనగా సైకిల్ పై వెళ్లి ఓటు వేసి వచ్చారు విజయ్. ఇక పవన్ కల్యాణ్ సంగతి తెలిసిందే. కాకపోతే స్పందించే శైలి కాస్త భిన్నంగా ఉంటుంది అంతే. అయితే పవన్ కల్యాణ్ 2014లోనే పార్టీ పెట్టినప్పటికీ ఆయనకు ఎమ్మెల్యే అవ్వడానికి పదేళ్లు పట్టిన పరిస్థితి. 2014లో పోటీ చేయకపోయినా.. 2019లో పోటీ చేసిన రెండుచోట్లా ఓటమి పాలయ్యారు.

అయితే... 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ - టీడీపీతో జతకట్టిన కూటమిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, డిప్యుటీ సీఎంగా ఎంపికయ్యారు, మంత్రిగా సేవలందిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో పవన్ టైపులోనే ఫ్యాన్ బేస్, సమస్యలపై స్పందించే థృక్పథం ఉన్న విజయ్ పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... ఇటీవల తమిళ రాజకీయాల్లో మరో పార్టీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించినప్పటికీ... ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన పిమ్మట ఎంట్రీ ఇవ్వాలని భావించారని అంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తన పార్టీ జెండాను విజయ్ ఆవిష్కరించారు.

విజయ్ పార్టీ "తమిళ వెట్రి కజగం" పార్టీ జెండా ఎరుపు, పసుపు రంగుల్లో రూపొందించారు. ఈ జెండా మధ్య భాగంలో జంట ఏనుగులు, పూలు ఉన్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం స్పందించిన విజయ్... తమిళనాడు సంక్షేమం కోసం పాటుపడుతూ, మన రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే మన వీర జెండా, విజయ పతాకమిదే అని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... ఇక నుంచి తమిళ వెట్రి కజగం పార్టీ జెండా దేశవ్యాప్తంగా ఎగురుతుందని.. ఇకపై తమిళనాడు గెలుస్తుందని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో... రాజకీయంగా కాస్త మెప్పించే ప్రణాళికతో ముందుకు వెళ్తే.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జనాలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తారనే పేరున్న తమిళ ప్రజానికం.. విజయ్ కు ఎలాంటి మద్దతు ప్రకటిస్తారనేది ఆసక్తిగా మారింది.

వాస్తవానికి తమిళనాడు రాజకీయాలకూ సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంటుందని చెబుతుంటారు. ఎంజేఆర్, జయలలిత, కరుణానిధి.. వీరంతా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అయినవారే. అయితే.. జయలలిత, కరుణానిధి ఇద్దరూ మరణించడంతో తమిళ రాజకీయాల్లో నాటి మజా లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒకానొక సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు.. ఐతే ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని అంటారు. ఇక కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సరిగ్గా ఇలాంటి సమయంలో... విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టీ ఆయనపై పడింది.

2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. పైగా... జయలలిత లేని లోటును తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పూడ్చగలుగుతారనే చర్చా తెరపైకి వచ్చిన పరిస్థితి. మరి... ఫస్ట్ అటెంప్ట్ లోనే విజయ్ సత్తా చాటుతారా.. లేక, పవన్ కల్యాణ్ లా పదేళ్ల సమయం పడుతుందా అనేది తెలియాలంటే 2026వరకూ వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News