చిరు వర్సెస్ దేవరకొండ.. మధ్యతరగతి వ్యసనం!
కుటుంబ విలువల నుండి వారి కెరీర్ వరకు ప్రతిదాని గురించి చర్చించడానికి ఈ వేదికపైకి వచ్చారు.
మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి తాను ఎదుర్కొన్న అవమానాల గురించి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజా చిట్ చాట్ లో వెల్లడించారు. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (డీఎంఎఫ్) ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఒరిజినల్ డే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. టాలీవుడ్ సెలబ్రిటీలే కాకుండా తెలుగు ప్రభావశీలురు హాజరైన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ- చిరంజీవి నడుమ సంభాషణ ఉత్కంఠ కలిగించింది. కుటుంబ విలువల నుండి వారి కెరీర్ వరకు ప్రతిదాని గురించి చర్చించడానికి ఈ వేదికపైకి వచ్చారు. ఈ సంభాషణలో ఛమక్కులు ఇప్పుడు అభిమానుల్లో చర్చగా మారాయి.
మెగాస్టార్ గా చిరంజీవి, యువహీరోగా దేవరకొండ చాలా దూరం ప్రయాణించి ఉండొచ్చు. కానీ ఈరోజు కూడా వారి లోపల `మిడిల్ క్లాస్` ఎక్కడికీ పోలేదని ఇద్దరూ ఒప్పుకున్నారు. నా జీవితం చాలా మారిపోయింది.. కానీ నా మనసు ప్రకారం నేను ఎప్పటికీ మిడిల్ క్లాస్ అబ్బాయిని అని విజయ్ చెప్పాడు, ``షాంపూ బాటిల్ దాదాపు ఖాళీగా ఉన్నప్పుడు నీళ్ళు నింపి వాడుకునే అలవాటు నాకు ఇప్పటికీ ఉంది.. అందుకే నేను వస్తువును విసిరేసే ముందే దానిని చాలా సద్వినియోగం చేసుకుంటాను`` అని అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. తాను కూడా సబ్బుతో అదేవిధంగా చేస్తానని పేర్కొన్నాడు. నేను చిన్న సబ్బు ముక్కలను పారేసే బదులు య వాటన్నిటినీ కలిపి మరో వారం పాటు వాడతాను. నా కుటుంబం అలవాటుగా విద్యుత్తును వృథా చేస్తుంది. నేను లైట్లు ఆఫ్ చేస్తూ తిరుగుతాను. (రామ్) చరణ్ రీసెంట్‌గా బ్యాంకాక్‌కి వెళుతూ లైట్‌లు ఆఫ్ చేయకుండా వెళ్లాడు. నేను వాళ్ల కోసం ఆపని చేశాను. నేను నీటి సంరక్షణ విషయంలోను ప్రత్యేకంగా ఆలోచిస్తాను. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇంకుడు కుంతలు తవ్వించాలి`` అని అన్నారు. అంతేకాదు ఇలాంటివి రాసేప్పుడు వ్యంగ్యంగానో వెటకారంగానో కాకుండా మీమ్స్ లాగా సర్కాస్టిక్ గా రాయాలని చిరు మీడియానుద్దేశించి కోరారు.
ఇదే ఇంటర్వ్యూలో నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో మా నాన్న (వెంకట్ రావు) నుండి నేర్చుకున్నాను అని చిరంజీవి అన్నారు. మా అమ్మ (అంజనా దేవి) కుటుంబంలో అందరినీ కూడా తన కుటుంబంలా చూసుకోవడం చూసి నేను పెరిగాను.. అని అన్నారు.