'ది గోట్ లైఫ్: ఆడు జీవితం' మూవీ రివ్యూ

'సలార్'లో వరదరాజ మన్నార్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్

Update: 2024-03-28 09:48 GMT

నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్-అమలా పాల్-జిమ్మీ జీన్ లూయిస్-కేఆర్ గోకుల్ తదితరులు

సంగీతం: ఏఆర్ రెహమాన్

ఛాయాగ్రహణం: సునీల్ కేఎస్

కథ: బెన్యమిన్

నిర్మాణం: విజువల్ రొమాన్స్

స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: బ్లెస్సీ

‘సలార్’లో వరదరాజ మన్నార్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. అతను నాలుగేళ్లకు పైగా ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ‘ది గోట్ లైఫ్: ఆడు జీవితం’ ఈ రోజే బహు భాషల్లో రిలీజైంది. ట్రైలర్ తో అభిరుచి ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. సినిమాగా ఎంతమేర మెప్పించిందో తెలుసుకుందాం పదండి.

కథ: నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తెలంగాణ ప్రాంతంలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. పెద్దగా చదువుకోని అతను చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లితో పాటు గర్భవతిగా ఉన్న తన భార్యను ప్రేమగా చూసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఐతే ఒక ఇల్లు కట్టుకుని తల్లి, భార్యతో పాటు పుట్టబోయే బిడ్డకు మెరుగైన జీవనం అందించాలనే లక్ష్యంతో అతను సౌదీ అరేబియాలో కొన్నేళ్లు పని చేసి రావాలనుకుంటాడు. తన స్నేహితుడి ద్వారా పరిచయమైన ఒక బ్రోకర్ కు డబ్బులిచ్చి వీసా తెచ్చుకుని సౌదీకి చేరుకుంటాడు. కానీ అక్కడ ఒక దళారీ తనతో పాటు వచ్చిన మరో వ్యక్తిని మోసం చేసి ఎడారిలో బానిసలుగా మార్చి వాళ్లిద్దరినీ వేర్వేరు మసారాల్లో పనికి పెడతాడు. అక్కడ యజమానుల చేత చిత్రహింసలు అనుభవిస్తూ.. గొడ్డు చాకిరీ చేస్తూ.. కనీస సౌకర్యాలు లేకుండా దారుణమైన జీవనం సాగిస్తూ ఏళ్లు గడిచిపోవడంతో నజీబ్ తనను తానే గుర్తు పట్టలేని స్థితికి చేరుకుంటాడు. మరి అక్కడి నుంచి నజీబ్ బయటపడడానికి ఏం చేశాడు.. తిరిగి తన కుటుంబం దగ్గరికి రావాలన్న అతడి ప్రయత్నం ఫలించిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: వరల్డ్ సినిమాలో ప్రతి జానర్లోనూ ఒక బెంచ్ మార్క్ అని చెప్పుకోదగ్గ చిత్రం ఒకటుంటుంది. ఒక జానర్ గురించి మాట్లాడుకున్నపుడు రెఫరెన్స్ లాగా అందులో బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా గురించి ప్రస్తావిస్తారు. సర్వైవల్ థ్రిల్లర్ అనే జానర్ విషయానికి వస్తే.. అందరూ రెఫర్ చేసేది ‘కాస్ట్ అవే’ గురించే. మనిషి జాడే లేని ఓ ప్రాంతంలో చిక్కుకుపోయి ఏళ్ల తరబడి ఒక్కడే ఉండిపోయిన వ్యక్తి సుదీర్ఘ పోరాటం తర్వాత అక్కడ్నుంచి ఎలా బయటపడి జనజీవనంలోకి వచ్చాడో చూపించే ఆ కథను చూసిన వాళ్లెవ్వరైనా కదిలిపోతారు. ఇకపై ఈ సర్వైవల్ థ్రిల్లర్ జానర్లో ఇండియాకూ ఓ గొప్ప సినిమా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇండియాలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి కానీ వాటన్నింటినీ మించిన మేలిమి చిత్రం.. ‘ది గోట్ లైఫ్: ఆణిముత్యం’. ఆస్వాదించే మనసుండాలే కానీ.. ఇదొక అద్భుతమే. ఏ కోశాానా సినిమాలా అనిపించకుండా.. ఒక మనిషి జీవన పోరాటాన్ని కళ్లారా చూస్తున్నట్లే అనిపిస్తుంది. నజీబ్ అనే వ్యక్తి పోరాటాన్ని.. సంఘర్షణను చూస్తూ కలిగే అనుభూతిని వర్ణించడానికి మాటలు కూడా ఉండవు.

‘ది గోట్ లైఫ్’ విషయంలో ముందుగా చేయాల్సిన హెచ్చరిక.. ఒక సగటు ఎంటర్టైనర్ ఆశించే వాళ్లయితే ఈ సినిమా జోలికే వెళ్లకూడదు. ఇది ఎక్కువగా బతుకు పోరాటంతో.. వేదనతో కూడుకున్న సినిమా. ప్రేక్షకులను బాధతో మెలిపెట్టేస్తుంది. ఒక దశలో నిస్సహాయతతో ప్రధాన పాత్ర చేసే ఆక్రందనలు చూసి తట్టుకోలేం. ఇంకెంతసేపు ఈ వేదన అనిపిస్తుంది. అదే సమయంలో బతుకు మీద ఆశ ఎంత గొప్పదో.. అది మనిషితో ఏ స్థాయి పోరాటం చేయిస్తుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఎంతో వేదన కలిగించి.. గొప్ప స్ఫూర్తినీ రగిలించే కథ ఇది. మనం అనుభవిస్తున్న సాధారణ జీవితం కూడా ఎంత గొప్పదో.. బతుకు పోరాటంలో ఎంతమంది అభాగ్యులు ఎన్ని రకాల నరకయాతనలు అనుభవిస్తున్నారో గుర్తు చేస్తుందీ కథ. మూడు గంటల సుదీర్ఘ నిడివితో సాగే ‘ది గోట్ లైఫ్’ చూడడానికి చాలా ఓపిక కావాలి. అంత నిడివి.. పైగా బాధతో మెలిపెట్టే సినిమా.. అమ్మో కష్టం అనుకునే వాళ్లు అంతసేపు కూర్చోవడం కొంచెం కష్టమే. కానీ ఇందులో ప్రధాన పాత్రకు.. ఎమోషన్ కు కనెక్ట్ అయితే మాత్రం మూడు గంటలు తెరకు అతుక్కుపోతాం. భావోద్వేగాల్లో తడిసి ముద్దయిపోతాం. కొన్ని రోజుల పాటు వెంటాడుతుందీ సినిమా.

గల్ఫ్ దేశాలకు వెళ్లి పని చేస్తే బోలెడన్ని డబ్బులొస్తాయి.. కొన్నేళ్లు పని చేసి లక్షలు వెనకేసుకుని వచ్చేస్తే ఇక్కడ జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు..! ఇది పాపులర్ ఒపీనియన్. కానీ ఇలా వలస వెళ్లిన వాళ్లలో ఎంతమందికి అక్కడ సౌకర్యవంతమైన జీవనం ఉంటుందన్నది ప్రశ్నార్థకం. కొద్దిమంది మాత్రమే తమ ఊహలకు తగ్గ ఉపాధి పొందుతారు. కాలా చాలామంది చిన్నాచితకా పనులు చేసి దుర్భర జీవనం సాగిస్తే.. ఇంకొందరు ఏజెంట్ల చేతుల్లో మోసపోయి బానిసలుగా మారి అత్యంత భయానక జీవనంలో మగ్గిపోతారు. అలా మగ్గిపోయి బతుకు మీద పూర్తిగా ఆశ కోల్పోయిన ఓ వ్యక్తి.. ఆ బానిస బతుకు నుంచి బయటపడ్డానికి చేసిన పోరాటమే ఈ సినిమా. నిజంగా ఒక వ్యక్తికి ఎదురైన అనుభవాల ఆధారంగా రాసిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఐతే మూడు గంటల సినిమాను పూర్తిగా ఈ కష్టాలు.. కన్నీళ్లు.. పోరాటం మీదే నడిపిస్తే ప్రేక్షకులు కుర్చీల్లో కుదురుగా కూర్చోవడం కష్టం. అందుకే దర్శకుడు బ్లెస్సీ ఆసక్తికర స్క్రీన్ ప్లేతో తొలి అర్ధాన్ని భిన్నంగా మలిచాడు.

హీరో సౌదీలో అడుగు పెట్టి ఒక వ్యక్తి చేతిలో మోసపోయి ఎడారిలో బానిసగా మారడంతో కథను మొదలుపెట్టి.. అక్కడ్నుంచి గతాన్ని వర్తమానాన్ని మార్చి మార్చి చూపిస్తూ కథనం ఆసక్తికరంగా నడిచేలా చూశాడు. డబ్బుల కోసం సౌదీకి వచ్చి గుప్పెడు నీళ్ల కోసం కష్టపడే హీరో.. గతంలో డబ్బులు లేకపోయినా ఒక నది ఒడ్డున ఎంత సంతోషంగా జీవించేవాడో పోల్చి చూపిస్తూ.. తన వేదనను కళ్లకు కడతాడు. బాహ్య ప్రపంచానికి దూరమైతే.. మనిషి సహచర్యం లేకపోతే.. ఒక వ్యక్తి ఎంతగా మారిపోతాడో కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు అద్భుతంగా చూపిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుత అభినయంతో కట్టిపడేస్తాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే పాటలో దర్శకుడి పొయెటిక్ టేకింగ్ చూడొచ్చు. చిన్న చిన్న డీటైలింగ్ తో అద్భుతమైన విషయాలను చెప్పారీ సినిమాలో. విరామ సమయానికి గొర్రెల మందతో కలిసి హీరో నీళ్లు తాగే సన్నివేశం గమనిస్తే హీరో ఆ గొర్రెల్లో ఒకడైపోయాడని అర్థమవుతుంది. ప్రథమార్ధంలో కథ రకరకాల ప్రదేశాల్లో నడవడం.. హీరో జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నింటినీ చూపించడం వల్ల కథనం వేగంగా సాగిపోతుంది. కానీ ద్వితీయార్ధం మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇందులో తప్పుబట్టడానికి మాత్రం ఏమీ లేదు. తానున్న చోటి నుంచి బయటపడి ఎడారిలో ఇంకో ఇద్దరితో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు హీరో. ఆ ప్రయాణాన్ని చూపించే క్రమంలో ఎంతో బాధ ఉంటుంది. కట్టె కొట్టె తెచ్చె అన్నట్లు చూపిస్తే హీరో కష్టం కనిపించదు. తన పోరాటంలో ఇంటెన్సిటీ ఉండదు. వివరంగా అంతా చూపిస్తే ఆ బాధను తట్టుకోవడం కష్టం. దీని వల్ల ద్వితీయార్ధం భారంగా అనిపిస్తుంది. హీరో ఎడారిని దాటి రోడ్డు మార్గంలో అడుగుపెట్టాక తనలాగే మనమూ ఊపిరి పీల్చుకుంటాం. తర్వాతి సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి. ముగింపు బాగుంది. కొన్ని సన్నివేశాలు కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఐతే ముందే అన్నట్లు వేదనతో కూడుకున్న ఇలాంటి సినిమాలు అందరికీ రుచించకపోవచ్చు. కానీ ఆస్వాదించగలిగే వారికి ‘ది గోట్ లైఫ్’ ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది.

నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ఏం చెప్పాలి? ఇతణ్నేనా మనం ‘సలార్’లో వరదరాజ మన్నార్‌ గా చూసింది అని షాకవ్వకుండా ఉండలేం. పెద్ద స్టార్ అయి ఉండి పృథ్వీరాజ్ ఇలాంటి పాత్ర చేయడం నమ్మశక్యం కాని విషయం. ఒక నటుడికి ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి పాత్ర చేయలేడు. వరుసగా సినిమాలు చేస్తూ ఏళ్ల తరబడి ఈ సినిమా కోసం ఒక లుక్.. ఒక మూడ్ ఎలా మెయింటైన్ చేయగలిగాడు.. అంతలా ఎలా ఆ పాత్రలో జీవించగలిగాడు అన్నది అర్థం కాని విషయాలు. నిజంగా ఒక వ్యక్తి ఏళ్ల తరబడి ఒక చోట బానిస బతుకు బతికితే ఎలా అయిపోతాడో.. తన బాడీలో అణువణువునా చూపించే ప్రయత్నం చేశాడు పృథ్వీరాజ్. కేవలం హావభావాాల్లోనే కాదు.. వాయిస్ విషయంలోనూ అతను ఒక పరిణామ క్రమాన్ని చూపించగలిగాడు. పృథ్వీరాజ్ అంకితభావానికి సెల్యూట్ క ొట్టకుండా ఉండలేం. అతడికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. అమలాపాల్ కాసేపు కనిపించినా ఆకట్టుకుంది. హీరోతో కలిసి పోరాటం సాగించే ఇద్దరు వ్యక్తుల పాత్రలు చేసిన నటులు కూడా చాలా బాగా చేశారు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిలో బాగా చేశారు.

సాంకేతిక వర్గం: కొన్నేళ్ల నుంచి సరైన ఫాంలో లేని ఏఆర్ రెహమాన్ ‘ది గోట్ లైఫ్’లో గొప్ప పనితనం చూపించాడు. అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతం. చాలా సన్నివేశాల్లో స్కోర్ హృదయాలను మెలిపెట్టేస్తుంది. భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లడంలో ఆర్ఆర్ ముఖ్య పాత్ర పోషించింది. పాటలు అంత క్యాచీగా లేవు కానీ.. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం తన స్థాయిని చూపించాడు రెహమాన్. ట్రూ ఇంటర్నేషనల్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలగడంలో రెహమాన్ స్కోర్ పాత్ర కీలకం. సునీల్ కేఎస్ కెమెరా పనితనం కూడా గొప్పగా సాగింది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు బ్లెస్సీ తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం ఎన్నో ఏళ్లు పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. కథగా చెప్పుకోవడానికి చిన్నదే కానీ.. దాన్ని మూడుగంటల సినిమాగా తీసి మెప్పించడంలో దర్శకుడు గొప్ప పనితనం చూపించాడు. ఇది డైరెక్టర్ ఫిలిం అని చెప్పే ఎన్నో సీన్లు సినిమాలో ఉన్నాయి.

చివరగా: ది గోట్ లైఫ్: ఇదొక అద్భుతం.. ఆస్వాదించగలిగితే!

రేటింగ్-3/5

Tags:    

Similar News