మనమే తోపు అనుకుంటే ఎలా?
ఈ రెండు పరిశ్రమల దర్శకులతో పనిచేయడానికి తెలుగు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మునుపటి కంటే పాన్ ఇండియాలో ఆ రెండు భాషల చిత్రాలకు డిమాండ్ కూడా పెరిగింది.
ఇండియాకి పాన్ ఇండియా మార్కెట్ ని పరిచయం చేసింది టాలీవుడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్'..'కార్తికేయ-2'..'పుష్ప' లాంటి విజయాలతోనే టాలీవుడ్ కి అది సాధ్య మైంది. వాటి సక్సస్ తో టాలీవుడ్ నెంబర్ వన్ కి చేరుకుంది. అంతకు ముందు మార్కెట్ పరంగా బాలీవుడ్ ది కాగా..దాన్ని వెనక్కి నెట్టి టాలీవుడ్ ఆక్రమించింది. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి అదే దూకుడు కొనసాగిం చడానికి మరింత మంది స్టార్లు...మేకర్లు సిద్దమై విజయ పథంలో నడిపించడానికి రెడీ అవుతున్నారు.
ఆ తర్వాత పాన్ ఇండియా సంచలనాలు అంటే? బాలీవుడ్..కోలీవుడ్ పరిశ్రమలే గుర్తొ స్తాయి. దేశ వ్యాప్తంగా ఆ రెండు పరిశ్రమల సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. టాలీవుడ్ కి పోటీగా ఆ రెండు పరిశ్రమల్ని చెప్పొచ్చు. వందల కోట్లు వసూళ్లు తెచ్చే సత్తా వాటికుంది. మరి శాండిల్ వుడ్..మాలీవుడ్ పరిశ్రమల్ని లైట్ తీసుకోవచ్చా? అందుకు ఛాన్సు లేదనే చెప్పాలి. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ఈ మధ్య కాలంలో పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి ఆ పరిశ్రమలు.
'కేజీఎఫ్'..'కాంతార' సినిమాలు శాండిల్ వుడ్ నుంచి పాన్ ఇండియాలో చర్చకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మాలీవుడ్ కంటెంట్ తెలుగులో రీమేక్ అవుతోన్న వైనాన్ని బట్టి వాటి సక్సస్ గురించి అంచనా వేయోచ్చు. 'ది కేరళ స్టోరీ'... '2018'..రీసెంట్ రిలీజె 'ప్రేమలు' లాంటి చిత్రాలు కేవలం కంటెంట్ తోనే కోట్ల వసూళ్లని రాబట్టాయి. వాటికి పాన్ ఇండియా లో మంచి ఆదరణ దక్కింది. ఇవన్నీ పరిమిత బడ్జెట్ లోనే నిర్మాణమైన చిత్రాలు...బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబట్టాయి.
ఈ రెండు పరిశ్రమల దర్శకులతో పనిచేయడానికి తెలుగు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మునుపటి కంటే పాన్ ఇండియాలో ఆ రెండు భాషల చిత్రాలకు డిమాండ్ కూడా పెరిగింది. గ్రేట్ టెక్నిషన్స్ అంతా కన్నడ..మలయాళ పరిశ్రమల్లోనే ఉన్నారని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. వాళ్లందరి ప్రతిభ ఇప్పుడు హిట్ రూపంలో బయటకు వస్తుంది. ఇదే కొనసాగించి..భారీ బడ్జెట్ సినిమాలవైపు అక్కడి దర్శక-నిర్మాతలు దృష్టి పెడితే ఇండియాని తమ కంటెంట్ తో షేక్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.