3 ఏంజెల్స్ కాన్సెప్ట్.. 'క్రూ'లాగా వర్కవుటవ్వదేమి?
హాలీవుడ్‌లో 'చార్లెస్ ఏంజెల్స్' ఎంతటి బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీనో తెలిసిందే. ముగ్గురు అందగత్తెల కవ్వింపు, రొమాన్స్, యాక్షన్, థ్రిల్స్ నేపథ్యంలో సిరీస్ ఆద్యంతం రక్తి కట్టిస్తుంది
హాలీవుడ్‌లో `చార్లెస్ ఏంజెల్స్` ఎంతటి బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీనో తెలిసిందే. ముగ్గురు అందగత్తెల కవ్వింపు, రొమాన్స్, యాక్షన్, థ్రిల్స్ నేపథ్యంలో సిరీస్ ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. చూస్తున్నంత సేపూ రొమాంటిక్ మూడ్ లేదా యాక్షన్ మూడ్ లోకి వెళ్లిపోతారు ఆడియెన్. అంతలోనే థ్రిల్లింగ్ సర్ ప్రైజ్ లు ఉంటాయి. తెర నిండుగా రసరమ్యమైన విందు అందించేందుకు ప్రముఖ దర్శకులు అందగత్తెలను ఒక చోట చేర్చడం అనే ఫార్ములా చాలా కాలంగా చూస్తున్నదే. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి అక్కడి నుంచి దేశంలోని ఇతర పరిశ్రమలకు కూడా ఈ ఫార్ములా బదిలీ అయింది.
ఇటీవలే టబు- కరీనా- కృతి సనోన్ కాంబినేషన్‌లో `క్రూ` తెరకెక్కి విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో ముగ్గురు అందగత్తెల గ్లామర్ షోతో పాటు కిక్కిచ్చే పెర్ఫామెన్స్ ప్రధాన అస్సెట్స్‌గా మారాయి. విమానయాన రంగంలో క్రూ సంబంధిత కథతో బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టారు. అయితే అందుకు భిన్నంగా రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఫర్హాన్ అక్తర్ ముగ్గురు అందగత్తెల కథను తెరపై చూపేందుకు సిద్ధమయ్యారు. ప్రియాంక చోప్రా- కత్రిన కైఫ్- ఆలియా భట్ లాంటి టాప్ హీరోయిన్లను ఫర్హాన్ ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాని 2021లో ప్రకటించగానే సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. కానీ ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లడంలో పూర్తిగా క్లారిటీ మిస్సయింది. ఒకానొక దశలో ఈ ప్రాజెక్టును ఆపేసారని ప్రచారమైంది. కానీ ఈ విషయాన్ని ఎక్సెల్ ప్రొడక్షన్స్ బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని.. ఈ సినిమాని పట్టాలెక్కించాలని ఫర్హాన్ భావిస్తున్నారని కూడా ప్రియాంక చోప్రా వెల్లడించింది.
అయితే బ్లాక్‌బస్టర్ హీరోయిన్ అలియా భట్ ఇద్దరు సీనియర్ స్టార్లు కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాలను కలుపుతూ సినిమా తీయడం అంటే అంత సులువు కాదు. వారి కాల్షీట్లను అడ్జస్ట్ చేయడం సమస్యాత్మకమైనది. ఎక్సెల్ ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. కాబట్టి ఆ ఇద్దరి కాల్షీట్లకు అనుగుణంగా పీసీ తన సమయాన్ని కేటాయించగలదు. కానీ ఆలియా కాల్షీట్లను పరిశీలిస్తే ఇప్పట్లో అంత సులువైన ప్రక్రియ కాదని కూడా అర్థం చేసుకోవాలి. ఇటీవల ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అసలేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎక్సెల్ సంస్థ నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వెలువడుతుందేమో చూడాలి. ఈ చిత్రం ముగ్గురు స్నేహితురాళ్లు రోడ్ ట్రిప్‌కు బయల్దేరాక ఏం జరిగిందనే కథతో రూపొందుతోంది. క్రూ సినిమాతో పోలిస్తే ఫర్హాన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించాలనుకుంటున్నందున కూడా ఇది అంతకంతకు ఆలస్యమవుతోందని భావించాల్సి ఉంటుంది.