మూవీ రివ్యూ : తిరగబడర సామి

గత వారమే 'పురుషోత్తముడు' అనే సినిమాతో పలకరించాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

Update: 2024-08-02 12:13 GMT

'తిగరబడర సామీ' మూవీ రివ్యూ

నటీనటులు: రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా-మకరంద్ దేశ్ పాండే-మన్నారా చోప్రా-రాజా రవీంద్ర-ప్రగతి-పృథ్వీ తదితరులు

సంగీతం: జె.బి-బోలే షావలి

ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి

నిర్మాత: మల్కాపురం శివకుమార్

రచన-దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి

గత వారమే 'పురుషోత్తముడు' అనే సినిమాతో పలకరించాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఇప్పుడు అతడి నుంచి 'తిరగబడర సామీ' అనే సినిమా వచ్చింది. ఒకప్పుడు యజ్ఞం.. వీరభద్ర.. పిల్లా నువ్వు లేని జీవితం లాంటి పేరున్న సినిమాలు తీసిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గిరి (రాజ్ తరుణ్) ఒక అనాథ. చిన్నపుడే ఓ జాతరలో తప్పిపోయి తల్లిదండ్రులకు దూరమైన గిరి.. పెద్దయ్యాక ఇలా తప్పిపోయిన పిల్లలు పెద్ద వాళ్లను వెతికి పెట్టడమే వృత్తిగా మార్చుకుంటాడు. తనకూ ఓ మంచి కుటుంబం కావాలని.. పెళ్లి కోసం చాలా మంది అమ్మాయిలను చూసినా తన నేపథ్యం చూసి ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. ఇలాంటిసమయంలో శైలజ (మాల్వి మల్హోత్రా) అనే అనాథ అతణ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్న సమయంలో కొండా రెడ్డి (మకరంద్ దేశ్ పాండే) అనే గూండా.. గిరికి ఒక అమ్మాయిని వెతికి పట్టుకునే టాస్క్ అప్పగిస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని చూస్తే తన భార్య శైలజనే అని అర్థమవుతుంది. ఇంతకీ శైలజ ఎవరు.. తన బ్యాగ్రౌండ్ ఏంటి.. కొండారెడ్డితో ఆమెకున్న సంబంధం ఏంటి.. కొండారెడ్డి నుంచి శైలజను కాపాడుకోవడానికి గిరి ఏం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సినిమాలో విలన్ తాలూకు రౌడీలు తమకు కావాల్సిన వాడి కోసం ఫొటో పట్టుకుని వెతికే సీన్లు చూస్తుంటాం. ఇలా ఎవరికైనా ఫొటో చూపించి ఇతణ్ని ఎక్కడైనా చూశారా అని అడిగినపుడు అతను తెలియదు అంటే ఆ వ్యక్తిని వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్లిపోతారు. ఒకవేళ తాము అడిగిన వ్యక్తి ఏదైనా తేడాగా ప్రవర్తించినా.. అతను తాము వెతుకుతున్న వ్యక్తి తాలూకు వాడని అనుమానం వచ్చినా.. రౌడీలు అతడి మీద దాడి చేయడం చూస్తుంటాం. కానీ 'తిరగబడరా సామీ'లో మాత్రం ఈ సందర్భంలో చాలా చిత్రమైన దృశ్యాలు చూస్తాం. ఇలా ఫొటో చూపించి ఇతణ్ని చూశావా అని ఒక రౌడీ అడగడం.. అతను తెలియదు అనగానే నలుగురు చుట్టుముట్టి అతణ్ని చంపి మనిషి శవమే కనిపించకుండా మాయం చేయడం జరుగుతుంది. అలా పోయిన వ్యక్తులందరి ఫొటోలతో 'కనబడుట లేదు' అంటూ పేపర్లో పడ్డ ప్రకటనల నేపథ్యంలో ఈ సినిమా టైటిళ్లు పడతాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. తాము ఇలా ఓ వ్యక్తిని వెతుకుతున్నట్లు తెలిసిన వాళ్లు ఎవ్వరూ కూడా బతకడానికి వీల్లేదంటూ ఆ రౌడీలు వాళ్లను చంపి అవతల పారేస్తుంటారట. ఇంతకీ వాళ్లు వెతుకుతున్న వ్యక్తి.. అంత డేంజరా అంటే అదేమీ కాదు. ఆ వ్యక్తి ఓ అమ్మాయి. తన పెంచి పెద్ద చేసిన వాడే ఆస్తి కాజేయడానికి చూస్తాడు. ఆమె తప్పించుకుని తిరుగుతుంటుంది. ఇలాంటి సన్నివేశాలతో సినిమాను ఓపెన్ చేసినపుడే.. 'తిరగబడరా సామీ' ఎంత సిల్లీ సినిమానో ఒక హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. సినిమాలో కొంచెం పిరికివాడైన హీరో విలన్ మీద తిరుగుబాటు చేయడానికి క్లైమాక్స్ వరకు టైం పడుతుంది కానీ.. ఈ సినిమా మాత్రం తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుల మీద తిరుగుబాటు చేసి చుక్కలు చూపించేస్తుంది.

గత వారమే రాజ్ తరుణ్ నుంచి 'పురుషోత్తముడు' అనే సినిమా వచ్చింది. దాన్ని రాజ్ కనీసం ప్రమోట్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. సినిమా చూశాక దీని మీద నమ్మకం లేక దానికి దూరంగా ఉన్నాడేమో అనిపించింది. 'తిరగబడరా సామీ' సినిమాకు మాత్రం ప్రి రిలీజ్ ఈవెంట్.. దాంతోపాటు ప్రెస్ మీట్లో కూడా పాల్గొనడంతో ఇదేదో కంటెంట్ ఉన్న సినిమానేమో అనుకున్నారు ప్రేక్షుకులు. కానీ 'తిరగబడరా సామీ' చూశాక 'పురుషోత్తముడు' ఒక సూపర్ హిట్ మూవీలా అనిపిస్తే ఆశ్చర్యం లేదు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఒక దశ తర్వాత టచ్ కోల్పోతుంటారు. కానీ 'తిరగబడరా సామీ' సినిమా చూస్తే.. 'యజ్ఞం'.. 'పిల్లా నువ్వు లేని జీవితం' లాంటి సినిమాలు తీసింది ఈ రవికుమార్ చౌదరేనా అని అనుమానం కలుగుతుంది. రెండు గంటల సినిమా మొత్తంలో పర్వాలేదు అని చెప్పుకోవడానికి కూడా ఒక్క సీన్ లేకుండా.. ఆద్యంత ఔట్ డేటెడ్ ఫీల్స్ ఇస్తూ సాగుతుంది 'తిరగబడరా సామీ'. హీరో.. హీరోయిన్.. విలన్ సహా ప్రతి పాత్రా అర్థరహితంగా.. చాలా డ్రమటిగ్గా సాగే ఈ సినిమాను రెండు గంటల పాటు పూర్తిగా చూడడం కూడా పెద్ద పరీక్షగా మారుతుంది.

అసలు హీరో పాత్రను డిజైన్ చేసిన తీరే విడ్డూరంగా అనిపిస్తుంది. హీరో ఒక అనాథ. చిన్నపుడే తన తల్లిదండ్రులకు దూరమవుతాడు. జాతరలో తప్పిపోయి ఒక వ్యక్తి చేరదీయడంతో పెరిగి పెద్దవాడవుతాడు. తనకు వచ్చిన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని తప్పిపోయిన వాళ్లను వెతికి పట్టుకోవడమే పనిగా పెట్టుకుంటాడు. ఐతే బతకడానికి ఏదో ఒక పని చేస్తూ.. దాంతో పాటే ఈ ఛారిటీ పెట్టుకుంటే ఓకే కానీ.. దీన్నే తన వృత్తిగా మార్చుకోవడమేంటన్నదే అర్థం కాదు. దీనికి మళ్లీ అతణ్ని టీవీ వాళ్లు పిలిచి.. తనది డిఫరెంట్ ప్రొఫెషన్ అంటూ ఇంటర్వ్యూ కూడా చేస్తారు. తనను చూసి ఇన్స్పైర్ అయిపోయిన హీరోయిన్.. తనను ప్రేమించి పెళ్లాడేస్తుంది. ఇంత డ్రమటిగ్గా.. సిల్లీగా హీరో హీరోయిన్ల పాత్రలను పరిచయం చేశాక సినిమా మీద ఇక ఏం ఆశలు పెట్టుకుంటాం. లీడ్ క్యారెక్టర్లే కాదు.. మిగతా పాత్రలు కూడా పేలవం. విలన్ పక్కన ఉండే రాధాబాయ్ పాత్రలో మన్నారాను చూశాక.. తన మీద తీసిన పాటను వీక్షించాక దర్శకుడిది ఎంత గొప్ప అభిరుచో అర్థమవుతుంది. పెద్ద బిల్డప్ ఇచ్చి విలన్ని పరిచయం చేశాక దాన్నో జోకర్ తరహా పాత్రగా మార్చేశారు. ప్రథమార్ధంలో అయినా కథేంటో తెలుసుకుందాం అన్న ఆసక్తి అయినా ఉంటుంది కానీ.. అదేంటో తెలిసిపోయాక ద్వితీయార్ధాన్ని భరించడమే పెద్ద పరీక్షగా మారుతుంది. చివర్లో రాజ్ తరుణ్ తో తనకు ఏమాత్రం సూటవ్వని వీర లెవెల్ ఫైటింగులు చేయించి.. అర్థరహితమైన డైలాగులు చెప్పించారు. అప్పటికి ప్రేక్షకులు తిన్న దెబ్బలన్నీ ఒకెత్తయితే క్లైమాక్స్ మరో ఎత్తులా అనిపిస్తుంది. మరీ ఈ స్థాయిలో మా మీద తిరగబడాలా అని దండం పెట్టేసి ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికి వస్తారు.

నటీనటులు:

కథల ఎంపికలో రాజ్ తరుణ్ జడ్జిమెంట్ పూర్తిగా దెబ్బ తినందనడానికి 'తిరగబడర సామీ' తాాజా రుజువు. 'పురుషోత్తముడు' చూసి తనకు నప్పని చొక్కా ఎందుకు తొడుక్కున్నాడనుకున్నాం. కానీ ఇది దాన్ని మించిన కళాఖండం. కాకపోతే సినిమాలో అంతో ఇంతో సెన్సిబుల్ గా అనిపించేది రాజ్ పాత్రే. తన నటన పర్వాలేదు. కానీ చివర్లో చేసిన విన్యాసాలు మాత్రం తనకు ఏమాత్రం సూట్ కాలేదు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా చాలా ఉత్సాహంగా నటించేసింది కానీ.. తన పాత్రలో విషయం లేదు. హీరోయిన్ కు అవసరమైన లుక్స్.. స్క్రీన్ ప్రెజెన్స్ తనకు లేవనిపిస్తుంది. రాజ్ పక్కన ఆమె పెద్దగా అనిపించింది. టాలెంటెడ్ మకరంద్ దేశ్ పాండేను ఈ సినిమాలో పూర్తిగా వేస్ట్ చేశారు. ఆయన ఓవరాక్షన్ భరించలేం. ఇక మన్నారా చోప్రా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తన కెరీర్లో ఇదే అత్యంత వరస్ట్ క్యారెక్టర్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తన మీద చిత్రీకరించిన పాట జుగుప్సాకరంగా అనిపిస్తుంది. రాజా రవీంద్ర.. ప్రగతి.. మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా కూడా 'తిరగబడరా సామీ'లో విశేషాలు ఏమీ లేవు. జె.బి... బోలే షావలి కలిసి అందించిన పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం చాలా రొటీన్. జవహర్ రెడ్డి ఛాయాగ్రహణం మామూలుగా సాగిపోయింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. గతంలో 'సూర్య వెర్సస్ సూర్య' లాంటి వెరైటీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన మల్కాపురం శివకుమార్ అసలు ఏం చూసి ఈ కథను సినిమాగా తీయాలని అనుకున్నాడో. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ రవికుమార్ చౌదరి గురించి ఏం చెప్పాలి. దర్శకుడిగా ఒక టైంలో గ్యాప్ వస్తే 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. కానీ ఈసారి మాత్రం రచయితగా.. దర్శకుడిగా కనీస స్థాయిలో కూడా మెప్పించలేకపోాయాడు. పూర్తిగా ఔట్ డేట్ అయిపోయిన ఐడియా తీసుకుని.. అంతకుమించిన మూస ధోరణిలో నరేట్ చేశాడు. ఈ రోజుల్లో ఇలాంటి కథతో హీరోను.. నిర్మాతను ఒప్పించి సినిమా తీసిన అతడి నైపుణ్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి.

చివరగా: తిరగబడర సామీ.. ప్రేక్షకులపై తిరుగుబాటు

రేటింగ్-1/5

Tags:    

Similar News