ప్రతియేటా ఘనంగా టాలీవుడ్ బర్త్‌డే వేడుకలు
తెలుగు సినీపరిశ్రమ నేడు 1000 కోట్ల వసూళ్లతో భారతీయ సినీపరిశ్రమలో సంచలనాలు సృష్టిస్తోంది.
తెలుగు సినీపరిశ్రమ నేడు 1000 కోట్ల వసూళ్లతో భారతీయ సినీపరిశ్రమలో సంచలనాలు సృష్టిస్తోంది. దశాబ్ధాల పాటు పెద్దన్నగా చెలామణి అయిన హిందీ చిత్రసీమను సైతం డామినేట్ చేస్తోంది. ఇలాంటి సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ `ఫిబ్రవరి 6`న తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ తేదీని టాలీవుడ్ బర్త్ డే వేడుకల కోసం లాక్ చేసామని ఛాంబర్ ప్రతినిధులు ఓ అధికారిక సమావేశంలో తెలియజేసారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు, వివిధ విభాగాలలో అవార్డులను కూడా ప్రదానం చేయాలని ఛాంబర్ నిర్ణయించింది. ప్రతి తెలుగు సినిమా నటుడి పుట్టినరోజున వారి ఇంట్లో, థియేటర్లలో ప్రత్యేక జెండాను ఉంచాలని ఫిలింఛాంబర్ నిర్ణయించింది. ఈ జెండాను రూపొందించే బాధ్యతను ఫిల్మ్ ఛాంబర్ సీనియర్ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు పాత్రికేయ సమావేశంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ-``మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. ఈ చిత్రానికి హెచ్.ఎం రెడ్డి దర్శకుడు. భక్త ప్రహ్లాదకు ముందు 1931లో `కాళిదాసు` అనే సినిమా వచ్చింది. కాళిదాసు చిత్రంలో తెలుగులో నాలుగు రీళ్ల పాటలు, సంభాషణలు ఉన్నాయి. ఎలా చూసినా సినిమా గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రతియేటా ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని ఛాంబర్ నిర్ణయించింది`` అని తెలిపారు.
సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ-``తెలుగు వారు గర్వించదగిన వ్యక్తులలో ఎల్వీ ప్రసాద్ మొదటి వ్యక్తి. ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు.. ప్రసాద్ గారు హిందీ, బెంగాలీ చిత్రాలలో నటించారు. దర్శకుడిగా రాణించారు. నేడు, రాజకీయ నాయకుల కంటే సినిమా వ్యక్తులే ప్రజలలో ఎక్కువ ప్రజాదరణ పొందారు. సినిమా నటులు ఎల్లప్పుడూ ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది`` అని అన్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ- ``తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించే మొదటి బర్త్ డే వేడుక ఇది`` అని అన్నారు. సినిమా తల్లిలాంటిది అయితే, తెలుగు సినిమా ఛాంబర్, మాతృ సంస్థ. ఇకపై ప్రతి సంవత్సరం వేడుకలు చేస్తాం. ఇది మొదటి సంవత్సరం కాబట్టి సాధారణంగా చేస్తాము.వచ్చే సంవత్సరం నుండి ఘనంగా వేడుకలు నిర్వహిస్తాం`` అని అన్నారు. ఒకప్పుడు మనల్ని మద్రాసీలు అని పిలిచేవారు. ప్రపంచం మొత్తం మన సినిమా వైపు అలానే చూస్తుంది. అన్ని సంఘాలు తెలుగు సినిమా పుట్టినరోజును జరుపుకోవాలని మాదాల రవి అన్నారు.
తెరపై తెలుగు సంభాషణలు వినిపించిన మొదటి చిత్రం కాళిదాస్, కాబట్టి ఆ చిత్రాన్ని సెలబ్రేట్ చేయాలని దర్శకసంఘం అధ్యక్షుడు వీర శంకర్ అన్నారు. తెలుగు సినిమా గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా ఘనంగా నిర్వహిస్తామని, ఈ తేదీని నిర్ణయించడానికి కారకులైన రెంటాల జయదేవ్‌గారికి ధన్యవాదాలు అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి అన్నారు.
ఛాంబర్ అధ్యక్షులు -భరత్ భూషణ్, పరుచూరి గోపాల్ కృష్ణ, ఆచంట గోపి, వేమూరి సత్యనారాయణ, బి.బాపిరాజు, మూవీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, వి.బాపిరాజు, ముత్యాల రాందాస్, గోపాల్ కృష్ణ, టి రామ సత్యనారాయణ, సుబ్బారెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.