సీనియ‌ర్ హీరోల‌తో యంగ్ కెప్టెన్ల మ్యాజిక్!

సీనియ‌ర్ హీరోలు..జూనియ‌ర్ మేక‌ర్ల హంగామా ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

Update: 2024-11-23 09:30 GMT

సీనియ‌ర్ హీరోలు..జూనియ‌ర్ మేక‌ర్ల హంగామా ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. స‌రైన స్టోరీ... ద‌ర్శ‌కుడిపై న‌మ్మకం కుదిరితే పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోయినా? సీనియ‌ర్ హీరోలంతా సినిమా చేయ‌డానికి సిద్దంగా ఉంటు న్నారు. ఒక‌ప్పుడు డైరెక్ట‌ర్ గా ఛాన్స్ ఇవ్వాలంటే? ఎన్నో లెక్క‌లుండేవి. ఎంతో అనుభ‌వాన్ని చూసే వారు. కానీ ఇప్పుడు న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు అందుకు భిన్నంగా అవ‌కాశాలు అందుకుంటున్నారు. అలాగే స‌క్సెస్ అవుతున్నారు. ప్ర‌స్తుతం కొంత మంది సీని హీరోలు జూనియ‌ర్ డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేస్తున్నారు. ఆ సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి 150వ‌కి పైగా సినిమాలు చేసిన చరిత్ర ఆయ‌నది. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా `విశ్వంభ‌ర` సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి వ‌శిష్ట అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా అత‌డికిది రెండ‌వ సినిమా మాత్ర‌మే. తొలిసినిమా క‌ల్యాణ్ రామ్ తో `బింబిసార` చేసి స‌క్సెస్ అందుకోవ‌డంతో చిరు అనుభ‌వంతో ప‌నిలేకుండా `విశ్వంభ‌ర‌`కి ఛాన్స్ ఇచ్చారు. అలాగే విక్ట‌రీ వెంక‌టేష్ కూడా కొత్త ద‌ర్శ‌కుల‌కు అలాగే అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా` సంక్రాంతికి వ‌స్తున్నాం` అనే సినిమా చేస్తున్నారు. దీనికి అనీల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. అనీల్ ని కూడా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసింది క‌ళ్యాణ్ రామ్ `ప‌టాస్` తోనే. ఆ త‌ర్వాత అనీల్ వ‌రుస‌గా విజ‌యాలు అందుకున్నాడు. వెంకీతో ఇప్ప‌టికే `ఎఫ్‌-2`, `ఎఫ్ -3` చేసి విజ‌యాలు అందించాడు. అదే న‌మ్మ‌కంతో ఇద్ద‌రు మ‌ళ్లీ సంక్రాంతికి వ‌స్తున్నారు. ఇక బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న `డాకు మ‌హారాజ్` కి బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సీనియ‌ర్ హీరోల్ని బాబి ప‌ర్పెక్ట్ గా డీల్ చేయ‌గ‌ల‌డు. ఆ న‌మ్మ‌కంతోనే బాల‌య్య ఛాన్స్ ఇచ్చారు.

ఇక కింగ్ నాగార్జున కొత్త ద‌ర్శ‌కుల్ని ప్రోత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. ఇత‌ర హీరోల‌తో క‌లిసి సినిమాలు చేయ‌డానికి ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌రు. పాత్ర న‌చ్చితే ముందుకెళ్లిపోవ‌డ‌మే. ప్ర‌స్తుతం ధ‌నుష్ తో కలిసి `కుబేర‌`లో న‌టిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న కూలీ చిత్రంలోనూ నాగార్జున భాగ‌మ‌య్యారు. పాత్ర న‌చ్చ‌డం స‌హా ద‌ర్శ‌కుల‌పై న‌మ్మ‌కంతోనే నాగ్ ముందుకెళ్తున్నారు.

Tags:    

Similar News