4 సినిమాలు ఒకేసారి… హిట్ ఎవరికో
డిసెంబర్ నెలలో టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
డిసెంబర్ నెలలో టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సలార్ రిలీజ్ డిసెంబర్ 22న కన్ఫర్మ్ కావడంతో ఆ సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేయాలని అనుకున్న టైర్ 2 హీరోలు అందరూ కాస్తా ముందుకి రావాల్సి వచ్చింది.
నేచురల్ స్టార్ నాని దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శౌర్యువ్ అనే కొత్త కుర్రాడితో హాయ్ నాన్న మూవీ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. దీనిపై నాని చాలా నమ్మకంగా ఉన్నారు. డిసెంబర్ 8న మెగా హీరో వరుణ్ తేజ్ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తోన్న ద్విభాషా చిత్రం ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ కాబోతోంది. రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా సిద్ధం అవుతోంది.
మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. వక్కంతం వంశీ నితిన్ హీరోగా ఎక్స్ట్రార్డినరీ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీతో ఇద్దరికి హిట్ చాలా అవసరం ఉంది. అలాగే కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతోన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా అదే డేట్ కి రాబోతోంది.
ఈ నాలుగు సినిమాల దర్శకులలో ఇద్దరు కొత్తవాళ్ళు కాగా మరో ఇద్దరు ఫ్లాప్ సినిమాలతో కెరియర్ కొనసాగిస్తున్నవారు కావడం విశేషం. ఈ నాలుగు సినిమాలు కలెక్షన్స్ పరంగా రికవరీ సాధించడానికి కేవలం రెండు వారల సమయం మాత్రమే ఉంటుంది. సినిమా సక్సెస్ అయితే సాలిడ్ కలెక్షన్స్ సాధించడానికి రెండు వారాల సమయం సరిపోతుంది.
అయితే నాలుగు సినిమాలు కూడా పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ లేకుండానే రాబోతున్నాయి. మరి వీటిలో ఏ చిత్రాలు ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని సిల్వర్ స్క్రీన్ పై హిట్ అయ్యి రెండు వారాల స్పేస్ ని వినియోగించుకుంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.