విశాఖలో అగ్రనిర్మాత మేనేజర్ గొడవేంటి?
విశాఖపట్నం నగర నడిబొడ్డున ఉన్న `సంగం - శరత్` థియేటర్లు నిరంతర రద్దీతో కళకళలాడుతుంటుంది.
విశాఖపట్నం నగర నడిబొడ్డున ఉన్న `సంగం - శరత్` థియేటర్లు నిరంతర రద్దీతో కళకళలాడుతుంటుంది. ఇప్పుడు సంగం- శరత్ పేరు రాంగ్ రీజన్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ పాపులర్ థియేటర్ల మేనేజర్ కి, టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు విశాఖ ఆఫీస్ మేనేజర్ కి మధ్య గొడవ జరిగిందని ప్రముఖ మీడియాలో కథనం వెలువడింది. ఏ విషయంలో ఇద్దరికీ గొడవ? అంటే.. దిల్ రాజు కంపెనీ మేనేజర్ `ఛత్రపతి` (ప్రభాస్) చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన కోసం సంగం శరత్ మేనేజర్ ని థియేటర్ల కోసం అడిగారు. అయితే అభిమానుల తాకిడి గడబిడతో థియేటర్లకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనతో యజమానులు దానిని తిరస్కరించారు. అయితే షో వేయడానికి ఛాన్సివ్వకపోతే సంక్రాంతి సినిమాలను మీ థియేటర్లలో ప్రదర్శించనివ్వను! అని దిల్ రాజు మేనేజర్ వ్యాఖ్యానించారని, ఇరు పార్టీల మధ్య మాటా మాటా పెరిగిందని చెబుతున్నారు.
ఈ గొడవలోనే ఎక్కడి నుంచో వచ్చి స్థానికులమైన మమ్మల్ని సవాల్ చేయడానికి మీరెవరు? అంటూ దిల్ రాజు మేనేజర్ ని హెచ్చరించినట్లు సమాచారం. ఒంగోలుకు చెందిన వ్యక్తి వైజాగ్ దిల్ రాజు ఆఫీసులో పని చేస్తూ స్థానికంగా నివసిస్తున్నారని తెలిసింది. గొడవ అనంతరం థియేటర్ యజమానులు కొందరిని దిల్ రాజు మేనేజర్ వద్దకు పంపారని.. ఆ తర్వాత అతడిని అసభ్యపదజాలంతో దూషించారని.. ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మేనేజర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు అని కథనం వెలువడింది. ఒక ప్రైమ్ థియేటర్ యజమాని నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు! అని అతడు వాట్సాప్ స్టేటస్‌గా పోస్ట్ చేయడంతో రచ్చవుతోంది. ఈ గొడవలో దిల్ రాజు మేనేజర్ పై థియేటర్ యజమానులు కేసు పెట్టారని తెలిసింది.
ఘటన అనంతరం దిల్ రాజు విశాఖపట్నం ఆఫీస్ మేనేజర్ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ... ఘటనను చిన్న సమస్యగా అభివర్ణించారు. తమ మధ్య కేవలం అపార్థం మాత్రమేనని.. ఇప్పుడు సరిదిద్దుకున్నామని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే కేసు విషయంలో రాజీ పడలేదని, ఫిర్యాదును ఉపసంహరించుకోలేదని శరత్ థియేటర్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.