పక్క చూపులు చూస్తున్న టాలీవుడ్ నిర్మాతలు!
ఈ క్రమంలో మన స్టార్స్ కంటే బయటి హీరోలకు భారీ రెమ్యునరేషన్లు ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు.
టాలీవుడ్ స్టార్స్ ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు పక్క ఇండస్ట్రీలలో పాగా వెయ్యాలని చూస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ ప్రారంభమైన తర్వాత, తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో మన స్టార్స్ కంటే బయటి హీరోలకు భారీ రెమ్యునరేషన్లు ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం తెలుగులో 'పుష్ప 2', RC 16, 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి క్రేజీ చిత్రాలను నిర్మిస్తోంది. అలానే ప్రభాస్ - హను రాఘవపూడి, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టింది. ఇప్పుడు 'నడికర్ లాల్ జూనియర్' అనే మలయాళ చిత్రంతో మాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంట్లో టోవినో థామస్ హీరోగా నటిస్తున్నారు. ఈ క్రమంలో 'గుడ్ బాడ్ అగ్లీ' మూవీతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోంది. అజిత్ కుమార్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు.
మైత్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ లు బాలీవుడ్ లోకి వెళ్ళడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ హిందీ నటుడు సన్నీ డియోల్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ చేసినట్లుగా సమాచారం. అంతేకాదు కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా కోసం పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చారనే టాక్ కూడా చాలా రోజులుగా వినిపిస్తోంది. దర్శకుడు కుదిరితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబడుతుందని అంటున్నారు. ఇక 'ది గోట్ లైఫ్' అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
OG, సరిపోదా శనివారం లాంటి చిత్రాలను నిర్మిస్తున్న RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య.. ఇప్పుడు కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే అగ్ర హీరో విజయ్ అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇది దళపతి కెరీర్ లో చివరి సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు. 'బేబీ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన SKN.. ఇప్పుడు అదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. సాయి రాజేశ్ దీనికి దర్శకుడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రస్తుతం 'రాజా సాబ్' తో పాటుగా మరికొన్ని క్రేజీ చిత్రాలని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో 'కాళీ' అనే బెంగాలీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గతంలో తమిళ్ లో రెండు సినిమాలను నిర్మించిన ఆయన.. ఇటీవల సంతానం, మేఘా ఆకాష్ లతో 'వడక్కుపట్టి రామసామి' అనే మూవీ చేశారు. కన్నడలోనూ మూడు చిత్రాలను నిర్మించారు. వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు కన్నడ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
90స్ లో ప్రతిబంధ్, ది జెంటిల్ మ్యాన్ వంటి హిందీ చిత్రాలని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. గతంలో తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. 2008లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'గజిని' హిందీ రీమేక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని పాండమిక్ టైంలో సితార ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ తో కలిసి 'జెర్సీ' సినిమాని హిందీలో రీమేక్ చేశారు అల్లు అరవింద్. గతేడాది అల్లు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'షెహజాదా', 'త్రీ ఆఫ్ అస్' వంటి చిత్రాలను నిర్మించారు. త్వరలో 'రామాయణం' లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం కాబోతున్నారు. అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా మూవీ ఉండనే ఉంది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గతేడాది 'వారసుడు' సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. జెర్సీ రీమేక్ తర్వాత హిందీలో 'హిట్: ది ఫస్ట్ కేస్' రీమేక్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి 'ఎఫ్ 2' సినిమాని హిందీలో రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నారు. సితార నాగవంశీ సైతం అప్పుడప్పుడు ఇతర భాషల్లో రూపొందే సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఎన్వీ ప్రసాద్ తన సంస్థలో ప్రస్తుతం మురగదాస్, శివ కార్తికేయన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న హిందీ సినిమాల ప్రొడక్షన్ లో ఆయన సోదరుడు ప్రణయ్ వంగా భాగం అవుతున్నారు.
నిజానికి గతంలో మూవీ మొఘల్ డి. రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఒరియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, బోజ్ పురి వంటి భాషల్లో సినిమాలు నిర్మించి రికార్డ్ క్రియేట్ చేసారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు శివ, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలని హిందీలో రీమేక్ చేశారు. అశ్వినీ దత్, రామోజీ రావు లాంటి సీనియర్ నిర్మాతలు సైతం అప్పట్లో ఇతర భాషల్లో సినిమాలు నిర్మించారు. అయితే రానురాను ఈ ట్రెండ్ తగ్గిపోతూ వచ్చింది. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలందరూ పక్క ఇండస్ట్రీలలో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. మరి వీళ్లలో ఎవరెవరు సక్సెస్ అవుతారో చూడాలి.