సంక్రాంతికి ఇంకెన్ని సినిమాలు రిలీజ్ చేస్తారండీ బాబూ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు
టాలీవుడ్ లో 'సంక్రాంతి పండుగ'ను సినిమాలకు బెస్ట్ సీజన్ గా భావిస్తుంటారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ సినిమాలను ఫెస్టివల్ సీజన్ లోనే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుంటారు. అందుకే ప్రతీ ఏడాది పొంగల్ సీజన్ కోసం తీవ్ర పోటీ ఉంటుంది. ఎప్పటిలాగే ఈసారి పండక్కి కూడా పోటీ ఎక్కువగానే ఉంది. తొమ్మిది నెలలు ముందుగానే డేట్స్ లాక్ చేయడం ప్రారంభించారు.
2025 సంక్రాంతి కోసం అందరి కంటే ముందుగా కర్చీఫ్ వేసిన సినిమా 'విశ్వంభర'. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొన్న ఫెస్టివల్ కి 'నా సామి రంగా' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ అక్కినేని నాగార్జున.. వచ్చే సంక్రాంతికి కలుద్దామని సక్సెస్ మీట్ లో ప్రకటించేశారు. ఇప్పటి వరకూ నాగ్ ఇంకా తన కొత్త చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళనప్పటికీ.. ఆయన గత చిత్రాల ప్లానింగ్ ను బట్టి చూస్తే, టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.
ఈ యేడాది పండగను మిస్ చేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. వచ్చే సంక్రాంతికి 'శతమానం భవతి 2' సినిమాతో కలుద్దామని చాన్నాళ్ల క్రితమే పోస్టర్ రిలీజ్ చేశారు. 'హను-మాన్' తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రతీ సంక్రాంతికి తన సినిమా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. 'జై హనుమాన్' ను సెట్స్ మీదకు తీసుకొచ్చి షూటింగ్ చేసేస్తున్నాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా కుదిరితే తన కొత్త చిత్రాన్ని బరిలో దించాలని ఆలోచిస్తున్నారట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో పీపుల్స్ మీడియా రూపొందించే 'రాజా సాబ్' మూవీ పొంగల్ కు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇలా స్టార్ హీరోల సినిమాలు, క్రేజీ చిత్రాలన్నీ సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుంటే.. ఇప్పుడు లేటెస్టుగా ఈ లిస్టులోకి మరో రెండు కొత్త సినిమాలు వచ్చి చేరాయి. రవితేజ 75 చిత్రంతో పాటుగా, వెంకటేశ్ 76వ సినిమాలు ఫెస్టివల్ సీజన్ లో రాబోతున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ చేసుకున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా కొత్త సినిమాకి అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇది ఆయన కెరీర్ లో మైలురాయి 75వ చిత్రం. భాను భోగవరపు అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. #RT75 అనే వర్కింగ్ టైటిల్ తో 2025 సంక్రాంతికి రెడీ అయిపోండ్రి అని ఉగాది సందర్భంగా నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ఇప్పటివరకు పొంగల్ హిట్ రుచి చూడని సితార.. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు.
ఇదే క్రమంలో విక్టరీ వెంకటేష్ - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న #VenkyAnil3 సినిమాని కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి నిర్మాత దిల్ రాజే కనుక, 'శతమానం భవతి 2' ను తప్పించి ఈ చిత్రాన్ని బరిలో నిలపాలని భావిస్తున్నారు. వీళ్ళు ముగ్గురూ గతంలో ఫెస్టివల్ సీజన్ లో మంచి రికార్డులు ఉన్నాయి కాబట్టి.. ఈసారి పండక్కి రావాలని ఫిక్స్ అయిపోయారు.
ఈ విధంగా ఎవరూ వెనక్కి తగ్గకుండా సంక్రాంతి విడుదల అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. స్టార్ హీరోలున్నా సరే ఏమాత్రం సంకోచించకుండా బరిలో దిగుతున్నట్లు పోస్టర్లు వదులుతున్నారు. కాకపోతే వీటిల్లో చివరకు ఏయే సినిమాలు పోటీలో ఉంటాయనేదే తెలియడం లేదు. ఎందుకంటే మొన్న పెద్ద పండక్కి కూడా ఇలానే డేట్లు ఇచ్చారు. కానీ ఫైనల్ గా హనుమాన్, గుంటూరు కారం, సైందవ్, నా సామిరంగా సినిమాలు మాత్రమే మిగిలాయి. మిగతావన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. మరి ఈసారి పొంగల్ కి ఫైనల్ గా ఎవరెవరి మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఉంటుందో వేచి చూడాలి.