చిరు నుంచి విశ్వక్ వరకూ.. లేడీ గెటప్స్ వేసిన హీరోలు!
అమ్మాయిల్లాగా హావభావాలు పలికించిన అగ్ర కథానాయకులు కూడా ఉన్నారు. లేడీ గెటప్స్ తో అదరగొట్టిన ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం.
మన హీరోలంతా ఎల్లప్పుడూ హీరోయిజం వున్న పాత్రలు చేయడానికే ఎక్కువ మక్కువ చూపిస్తారు. స్టార్ డమ్, ఇమేజ్ అంటూ ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. కొందరు హీరోలు మాత్రం అప్పుడప్పుడు దాన్నుంచి కాస్త బయటకు వచ్చి, ప్రయోగాలు చేస్తుంటారు. అభిమానులను అలరించడానికి 'లేడీ గెటప్స్' వెయ్యడానికి సైతం వెనుకాడని హీరోలున్నారు. కథలో భాగంగా మహిళలుగా మారిపోయి అమ్మాయిల్లాగా హావభావాలు పలికించిన అగ్ర కథానాయకులు కూడా ఉన్నారు. లేడీ గెటప్స్ తో అదరగొట్టిన ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'చంటబ్బాయ్' సినిమాలో ఓ పాటలో లేడీ గెటప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. చిరు పూర్తిగా మీసాలు లేకుండా నటించడానికి ఇబ్బంది పడతారేమో అని, ఆరోజు సెట్స్ లో టీమ్ అంతా క్లీన్ సేవ్ తో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు జంధ్యాల. 'పట్నం వచ్చిన పతివ్రతలు' చిత్రంలో చిరంజీవితో పాటుగా మంచు మోహన్ బాబు కూడా మహిళలుగా మేకప్ వేసుకున్నారు. 'పాండురంగడు' చిత్రంలో నందమూరి బాలకృష్ణ కొన్ని నిమిషాల పాటు స్త్రీగా మారిపోతారు. 'టాప్ హీరో'లోనూ చీరకట్టులో కనిపిస్తారు.
విక్టరీ వెంకటేశ్ 'వాసు', 'బాడీగార్డ్' చిత్రాల్లో మీసాలు తీసేయకుండానే లేడీ గెటప్ లో కనిపించి, నవ్వులు పూయించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ 'మేడమ్' 'వివాహ భోజనంబు' సినిమాల్లో అమ్మాయి వేషధారణలో కనిపించి హిట్లు కొట్టారు. 'ఆల్ రౌండర్' లో 'అత్తర సాయిబో రారా' అంటూ లేడీ గెటప్ లో ఆడిపాడారు. 'చిత్రమ్ భళారే విచిత్రమ్' 'జంబలకడి పంబ' చిత్రాల్లో అమ్మాయిగా మారి వీకే నరేష్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. 'ఓహో నా పెళ్ళంట' చిత్రంలో మహిళగా మెప్పించారు హరీశ్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ 'గంగోత్రి' లో లేడీ గెటప్ వేశారు. 'మా మా మామయ్యది మొగల్తూరు' అంటూ స్టెప్పులేశారు. 'కితకితలు' సినిమాలో అల్లరి నరేష్ గడ్డం మీసాలు తీసేయకుండానే అమ్మాయి వేషధారణలోకి మారిపోయారు. 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో మంచు మనోజ్ మోహిణిగా కనిపించి ఆకట్టుకున్నారు. 'ఏమో గుర్రం ఎగురావచ్చు' మూవీ లేడీ గెటప్ వేశారు అక్కినేని హీరో సుమంత్. అచ్చం అమ్మాయిలాగా హావభావాలు పలికించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఉదయ్ కిరణ్ 'జోడి నెం.1' కోసం లేడీ గెటప్ వేశాడు కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
ప్రయోగాలకు పెట్టింది పేరైన విశ్వనటుడు కమల్ హాసన్.. 'భామనే సత్యభామనే' 'దశావతారం' చిత్రాల్లో వయసు మీద పడిన భామగా అలరించారు. 'పనక్కరన్', ‘నూరు వరుషం’ వంటి తమిళ చిత్రాల్లో లేడీ గెటప్ వేసిన సూపర్ స్టార్ రజనీకాంత్.. 'రోబో'లో ఓ సీన్ లో మహిళగా కనిపించడానికి మేకప్ వేసుకున్నారు. చియాన్ విక్రమ్ 'మల్లన్న' 'ఇంకొక్కడు' సినిమాల కోసం లేడీ గెటప్ వేసి పాత్రలను రక్తి కట్టించారు. 'వీడొక్కడే' లో ఓ పాటలో లేడీగా తళుక్కున మెరిసారు హీరో సూర్య.
'ప్రియమనలే' లో విజయ్ మీసాలతోనే మహిళగా కనిపించారు. 'కాంచన' చిత్రంలో రాఘవ లారెన్స్, శరత్ కుమార్ చీరకట్టి నటించారు. ‘రెమో’ సినిమాలో హీరో శివకార్తీకేయన్ లేడీ నర్స్ గా నటిస్తే.. 'వాడే వీడు' లో ఒక పాటలో లేడీ గెటప్ వేశారు హీరో విశాల్. 'సూపర్ డీలక్స్' సినిమాలో విజయ్ సేతుపతి లేడీ లుక్ తో అదరగొట్టారు. వీరితో పాటుగా పలువురు హిందీ, కన్నడ హీరోలు కూడా మహిళా వేషధారణలో అలరించారు.
అయితే ఈ జనరేషన్ కుర్ర హీరోలలో లేడీ గెటప్స్ వేసే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఆయన హీరోగా తెరకెక్కుతున్న 'లైలా' సినిమాలో అమ్మాయిగా కనిపించబోతున్నారు. బుధవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన మేకర్స్, కేవలం విశ్వక్ కళ్ళు మాత్రమే కనిపించేలా ప్రీ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. 2025 వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.