ఉమెన్స్ డే స్పెషల్: టాలీవుడ్ స్టార్ వైవ్స్!

నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా టాలీవుడ్ స్టార్ వైవ్స్ గురించి తెలుసుకుందాం.

Update: 2024-03-08 07:52 GMT

ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అనేది ఎప్పటినుండో ఉన్న మాట. సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించే ప్రతీ పురుషుడి వెనుక ఖచ్చితంగా ఓ మహిళ తోడ్పాటు, ప్రోత్సాహం ఉంటుంది. మన స్టార్ హీరోల జీవితాల్లోనూ వారి భార్యలు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. సినిమాల విషయాల్లోనే కాకుండా.. ఇతర వ్యాపారాలు, బ్రాండింగ్ వ్యవహారాల్లోనూ భర్తలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా టాలీవుడ్ స్టార్ వైవ్స్ గురించి తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. సక్సెస్ ఫుల్ హీరోగానే కాదు, పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు. అయితే దీని వెనుక ఆయన సతీమణి నమ్రత ఘట్టమనేని సహకారం ఎంతో ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మహేశ్ ను ప్రేమ వివాహం చేసుకున్న నమ్రత.. పెళ్ళి తర్వాత సినిమాలకు దూరమై, పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయించింది. ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే, మహేష్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడంలో తనవంతు సహాయం చేస్తోంది.

మహేశ్ బాబు స్థాపించిన GMB ప్రొడక్షన్స్ పనులన్నీ నమ్రతనే దగ్గరుండి చూసుకుంటుంది. ఆ బ్యానర్ లో రూపొందే సినిమాలకు బాధ్యత వహిస్తుంది. AMB సినిమాస్ మల్టీప్లెక్స్‌ లో పెట్టుబడులు పెట్టడానికి ఆమెనే ప్రధాన కారణం. హంబుల్.కో ద్వారా టెక్సటైల్ బిజినెస్ లోకి అడుగుపెట్టడంతో పాటుగా, ఇటీవల హోటల్ వ్యాపారంలోనూ దిగారు. అలానే MB ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక మహేష్ బాబు రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ వ్యవహారాలన్నీ నమ్రత చూసుకుంటుందని ఇండస్ట్రీలో అందరూ అంటూంటారు.

మహేశ్ బాబు పబ్లిసిటీకి సంబంధించిన విషయాల బాధ్యత కూడా ఆమెదే అని టాక్ ఉంది. దీని కోసం ముంబై ఏజెన్సీతో టై-అప్ అయినట్లు రూమర్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నమ్రత.. ఎప్పటికప్పుడు తన భర్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, ఫోటో షూట్స్ విషయాలను పంచుకుంటూ ఉంటుంది. మహేశ్ సినిమాలతో బిజీగా ఉంటే, ఇలా బిజినెస్ వ్యవహారాలన్నీ తన భుజానికి ఎత్తుకొని భర్తకు తోడుగా ఉంటోంది. నమ్రత సపోర్ట్ ఉంటుంది కాబట్టే, మహేష్ ఇంత సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నారని సినీ జనాలు చెప్పుకుంటారు.

మహేశ్ బాబుకు నమ్రత ఎలాగో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉపాసన అలాగా అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. చెర్రీని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఉపాసన.. ఓ పక్క మెగా కోడలి బాధ్యతలు, ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌ గా వ్యవహరిస్తోంది. గతేడాది తల్లిగా మారి, కొత్త బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ముద్దుల కూతురు క్లీంకారతో ఎక్కువ సమయం గడుపుతూ, అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది.

ఉపాసన తన భర్త రామ్ చరణ్‌ వ్యాపారాల్లోనూ అతని వెన్నంటే ఉండి నడిపిస్తోంది. అతన్ని ప్రమోట్ చేసే బాధ్యత కూడా తీసుకుందని, బ్రాండ్ వాల్యూ పెరగడానికి ఆమె కూడా ఒక కారణమనే టాక్ ఉంది. మెగా కపుల్ ఈ మధ్యనే ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపైకి మెరిసే అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 'ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అన్నట్లే.. ప్రతి మహిళ విజయం వెనుక ఆమెకు అండగా, రక్షణగా నిలబడే ఒక మగవాడు ఉంటాడు' అని చరణ్ ను ఉద్దేశిస్తూ ఉపాసన ఆ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సైతం తన భర్తకు సపోర్ట్ గా నిలుస్తోంది. బన్నీ సినిమాలతో బిజీగా గడుపుతుండగా, ఆమె తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటోంది. అలానే పికాబూ అనే ఫోటో స్టూడియో బిజినెస్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో తన భర్త, పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది అల్లు స్నేహ. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సైతం తన భర్తకు అండగా నిలుస్తోంది. తారక్ సినిమా షూటింగులతో తీరిక లేకుండా బిజీగా ఉంటే, ఆమె తన ఇద్దరు పిల్లల యోగ క్షేమాలు చూసుకుంటూ వస్తోంది. లక్ష్మి ప్రణతి కూడా వ్యాపార రంగంలో అడుగుపెట్టబోతున్నట్లు టాక్.

ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు అందరూ తమ భర్తల విజయానికి తమ వంతు తోడ్పాటునందిస్తూ, మహిళలు మహారాణులు అని నిరూపించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నమ్రత, ఉపాసన, లక్ష్మీ ప్రణతి, స్నేహా రెడ్డిల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీరంతా తరచుగా కలుస్తూ పార్టీలు చేసుకుంటూ, మంచి హెల్తీ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు.

Tags:    

Similar News