టైర్ 2 హీరోల పెద్ద సినిమాలు.. గట్టిగా కొట్టాల్సిందే..
టాలీవుడ్ లో టైర్ 1 హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. అలాగే వారి మార్కెట్ కూడా 200 కోట్ల వరకు ఉంది
టాలీవుడ్ లో టైర్ 1 హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. అలాగే వారి మార్కెట్ కూడా 200 కోట్ల వరకు ఉంది. సినిమా కోసం కూడా 200+ కోట్లకి పైగానే ఖర్చు చేస్తున్నారు. ఇక టైర్ 2 హీరోలుగా టాలీవుడ్ లో తమకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్న స్టార్స్ వరుస సక్సెస్ లు అందుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇప్పుడు మాత్రం ప్రేక్షకుల అభిరుచి మారిన నేపథ్యంలో వారు కూడా కథల విషయంలో కాస్తా పద్ధతి మార్చారు.
టైర్ 2 హీరోలలో అందరికంటే ఎక్కువ సక్సెస్ లు అందుకొని కమర్షియల్ గా దూసుకుపోతున్న నటుడు అంటే నేచురల్ స్టార్ నాని అని చెప్పాలి. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు సక్సెస్ లు నాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత నాని చేస్తోన్న రెండో సినిమా ఇది కావడం విశేషం. ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు.
అక్కినేని యువ హీరో నాగ చైతన్య నుంచి చివరిగా వచ్చిన థాంక్యూ, కస్టడీ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయితే ఈ సారి మాత్రం పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ కొట్టడానికి ‘తండేల్’ చేస్తున్నారు. ఈ సినిమా కోసం లుక్, యాస అన్ని చైతూ మార్చుకున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ప్రేమమ్ మూవీ వచ్చి హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత మరోసారి చందూ, చైతూ తండేల్ తో పాన్ ఇండియా హిట్ కోసం రెడీ అవుతున్నారు.
రామ్ పోతినేనికి చివరిగా ది వారియర్, స్కంద సినిమాలతో రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్ లు వచ్చాయి. ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ తో బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో వస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. రామ్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ‘ఇస్మార్ట్ శంకర్’ అందుకుంది. దానిని ‘డబుల్ ఇస్మార్ట్’ తో బ్రేక్ చేయాలని ఇద్దరు అనుకుంటున్నారు. అలాగే నితిన్ వెంకి కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ సినిమాతో ఈ ఏడాది రాబోతున్నాడు.
ఇప్పటికే వీరిద్దరూ కలిసి భీష్మతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రెండోసారి మరో సూపర్ హిట్ ని అందుకోవాలని కష్టపడుతున్నారు. ఈ నలుగురు హీరోలు హిట్ కాంబినేషన్స్ లోనే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. వీటితో 100 కోట్ల కలెక్షన్స్ 150 కోట్ల మార్కెట్ ని టచ్ చేయాలని అనుకుంటున్నారు. ఈసినిమాలపైనే అయితే పబ్లిక్ లో పాజిటివ్ బజ్ ఉంది. దానిని ఎంత వరకు సక్సెస్ గా మార్చుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.