ట్రైలర్ టాక్: రా & రస్టిక్ గా అనన్య నాగళ్ళ 'పొట్టేల్'
ఓవరాల్ గా ట్రైలర్ ని బట్టి చూస్తే, రా అండ్ రస్టిక్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తోన్న 'పొట్టేల్' సినిమా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
ఇటీవల కాలంలో ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా ''పొట్టేల్''. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, స్పెషల్ పోస్టర్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా ఆవిష్కరించారు.
చదువు ప్రాముఖ్యతను వివరిస్తూ, మంచి మెసేజ్ ఇచ్చే కంటెంట్ తో ''పొట్టేల్'' సినిమా రూపొందించినట్లు 3 నిమిషాల ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఇందులో 1980లో తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని ఒక పల్లెటూరులో జరిగే కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ లోకి వెళ్తే, చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మిన ఒక నిరుపేద గ్రామస్థుడు.. తన కూతురు సరస్వతికి మంచి విద్యను అందించాలని కోరుకుంటాడు. కానీ ధనిక, పేద తారతమ్యాలు చూపే ఆ ఊర్లో పరిస్థితులు దానికి అనుకూలంగా లేనట్లు కనిపిస్తోంది. గ్రామ దేవతకు బలివ్వడానికి వదిలిన ఓ పొట్టేలు మిస్సవ్వడంతో అతని జీవితం తలక్రిందులైనట్లు తెలుస్తోంది.
యువ చంద్ర కృష్ణ అమాయకపు గొర్రెల కాపరిగా, ఎలాగైనా కూతురిని చదివించాలని తపన పడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతని భార్య బుజ్జమ్మగా అనన్య నాగేళ్ల కనిపించింది. అయితే పొట్టేలును గాలికి విడిచిపెట్టి, కూతురు చదువు మీద దృష్టి పెట్టడం వల్లనే అది తప్పిపోయిందంటూ ఊర్లో జనాలంతా అతన్ని నిందించడం మొదలుపెట్టారు. ఊర్లో జరిగే అనర్థాలన్నిటికీ అదే కారణమంటూ అతన్ని కొట్టడం.. అతను తన కుమార్తెను తీసుకొని అక్కడి నుంచి పారిపోవాడానికి ప్రయత్నించడం.. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే పరిస్థితులు వంటివి ఈ ట్రైలర్ ను కట్ చేసారు. చివర్లో పొట్టేలుకు బదులుగా ఆ పాపని బలివ్వడానికి తీసుకెళ్తున్నట్లుగా చూపించారు.
'పొట్టేల్' సినిమాలో పటేల్ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అజయ్ కనిపించారు. ఇంతకముందు ఎప్పుడూ చేయని ఇంటెన్స్ రోల్ లో ఆశ్చర్యపరిచాడు. అనన్య నాగళ్లకు ఎలాంటి డైలాగ్స్ లేనప్పటికీ, ట్రైలర్ లో తన ఉనికిని చాటుకుంది. కథలో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యువ చంద్ర కృష్ణ తన క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, రియాజ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
సాహిత్ మోత్కూరి ఈసారి రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ స్టోరీ చెప్పబోతున్నాడని 'పొట్టేల్' ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. విద్య ప్రాముఖ్యతను చెబుతూనే.. ఆరోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ఉండే ఆచారాలు, సాంప్రదాయాలు, దురాచారాలు, మూఢనమ్మకాలు వంటివి ప్రస్తావించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్ లో అనన్య నాగళ్ల కడుపు మీద తన్నే సన్నివేశం, యువ చంద్రని కొట్టే సీన్స్ కొన్ని చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తాయి. మోనీష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ నేపథ్యానికి తగ్గట్టుగా ఉంది. శేఖర్ చంద్ర బీజీఎమ్ మనల్ని కథలో లీనం చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గా వినిపించే పెంచల దాస్ పాడిన మనల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది.
ఓవరాల్ గా ట్రైలర్ ని బట్టి చూస్తే, రా అండ్ రస్టిక్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తోన్న 'పొట్టేల్' సినిమా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్ & ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్స్ పై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా.. నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. 'పొట్టేల్' సినిమాని అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది.