లింగమార్పిడి నటికి హోటల్ గది ఇవ్వనన్నారు!
ఇప్పుడు ఒక ప్రముఖ ట్రాన్స్ జెండర్ నటికి హోటల్ రూమ్ ఇచ్చేందుకు నిరాకరంచడం సంచలనమైంది.
హిజ్రా (ట్రాన్స్‌జెండర్)లకు సమాజంలో గౌరవంతో పాటు వారి కనీసం జీవించే హక్కుకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత సమాజానికి ఉందని కోర్టులు సూచించాయి. కానీ హిజ్రాలకు బహిరంగ ప్రదేశాల్లో ఎదురయ్యే ఛీత్కారాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఒక ప్రముఖ ట్రాన్స్ జెండర్ నటికి హోటల్ రూమ్ ఇచ్చేందుకు నిరాకరంచడం సంచలనమైంది.
ఆమె మరాఠా నటి. 'ఆరతి' అనే మరాఠా చిత్రంతో పాపులరైంది. నటి పేరు ప్రణిత్ హట్టే. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసారు. ట్రాన్స్‌జెండర్ అయినందుకు హోటల్ గది ఇచ్చేందుకు తిరస్కరించారని తెలిపారు. 'హోటల్ పూజా ఇంటర్నేషనల్' అనే హోటల్‌లో గదిని బుక్ చేసుకున్నాము.. కానీ తాను ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో సిబ్బంది బుకింగ్‌ను రద్దు చేశారని ప్రణిత్ పేర్కొన్నారు.
రూమ్ బుకింగ్ క్యాన్సిలేషన్ చేయడంతో తమ కోపం, చిరాకును ప్రణిత్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ప్రదర్శించారు. వారు హోటల్ అధికారులకు డాక్యుమెంట్లు కూడా ఇచ్చారు. ప్రణిత్ లింగ సమస్య కారణంగా రూమ్ బుకింగ్‌ను రద్దు చేసినట్లు వారు తెలియజేశారు. ప్రణిత్ తన వీడియోలో మరాఠీలో మాట్లాడుతూ.. తాము ఎక్కడికి వెళ్ళాలి? అని ప్రశ్నించారు. హోటల్ సిబ్బంది ప్రవర్తనపై కోపం ప్రదర్శించారు. ప్రణిత్ అభిమానులను సలహాలు పరిష్కారాల కోసం అడిగారు. క్లిప్‌లో హిజ్రాలపై ఇలాంటి వ్యక్తుల వైఖరిపై తమ ఆందోళనను హట్టే షేర్ చేసారు. తాము పని నిమిత్తం నాసిక్‌లో ఉన్నామని, ట్రాన్స్‌జెండర్ల విషయంలో ప్రజల ప్రవర్తన మారాలని పేర్కొన్నారు.