నిజమే.. ఆ ట్యాగ్ ఈ సినిమాకే!

క్రిస్మస్ సెలవుల్లో మలయాళంలో మోహన్ లాల్ లాంటి టాప్ హీరో నటించిన ‘బరోజ్’ అనే భారీ చిత్రం విడుదలైంది.

Update: 2025-01-01 09:49 GMT

క్రిస్మస్ సెలవుల్లో మలయాళంలో మోహన్ లాల్ లాంటి టాప్ హీరో నటించిన ‘బరోజ్’ అనే భారీ చిత్రం విడుదలైంది. కానీ అంత పెద్ద చిత్రం.. ఓ మిడ్ రేంజ్ హీరో నటించిన ముందు నిలవలేకపోయింది. ‘బరోజ్’ను చిత్తుగా ఓడించి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఆ సినిమానే.. మార్కో. జనతా గ్యారేజ్, భాగమతి లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఉన్ని ముకుందన్ ఇందులో హీరో. తెలుగులో చేసిన సినిమాల్లో ఉన్ని కొంచెం సాఫ్ట్ రోల్సే చేశాడు కానీ.. ‘మార్కో’లో మాత్రం ఎవ్వరూ ఊహించని వైల్డ్, వయొలెంట్ పాత్ర చేశాడు. ఈ సినిమా చూసిన మలయాళీలు ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇదే మోస్ట్ వయొలెంట్ మూవీ అంటుంటే.. నిజమేనా అని సందేహించారు మిగతా భాషల వాళ్లు. కానీ ఈ రోజు తెలుగులో రిలీజైన ఈ చిత్రాన్ని చూసిన మన ఆడియన్స్ వామ్మో వాయ్యో అంటూ దండాలు పెట్టేస్తున్నారు.

యానిమల్, కిల్ లాంటి సినిమాలు చూసి వీటిని మించిన వయొలెంట్ మూవీస్ లేవు అనుకున్న వాళ్లంతా.. ‘మార్కో’ ముందు అవి దిగదుడుపే అని తేల్చేస్తున్నారు. ‘మార్కో’ ఇప్పుడే కాదు.. చాలా ఏళ్ల పాటు ఇండియాస్ మోస్ట్ వయొలెంట్ మూవీ అనే ట్యాగ్‌తో కంటిన్యూ కాబోతోందని తీర్మానిస్తున్నారు. హీరో క్లైమాక్సులో విలన్ కడుపును కత్తితో చీల్చి అతడి గుండెను చేతిలోకి తీసుకుని నిలబడే సీన్ చూశాక.. ఇలాంటి సీన్ రాయాలనే, తీయాలనే ఊహ అయినా ఎలా వచ్చిందిరా దేవుడా అని ఆడియన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇలా సినిమాలో చెప్పుకోవడానికి చాలా వయొలెంట్ సీన్లే ఉన్నాయి. ఎంత కఠినాత్ములైనా ఈ సినిమా చూస్తూ చూస్తూ స్క్రీన్ వైపు చూడలేక ముఖం తిప్పేయడమో.. కళ్లకు చేతులు అడ్డు పెట్టుకోవడమో చేస్తారు. ఇదేం వయొలెన్సు బాబోయ్ అని బెంబేలెత్తిపోయేలా ఘోరాతి ఘోరమైన సీన్లు పెట్టేశారు సినిమాలో. ఎంత ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చినా సరే, ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు అసలెలా క్లియర్ చేసిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News