మార్కో సీక్వెల్ ప్లాన్.. ఉన్ని ముకుందన్ జాక్‌పాట్
కల్కి 2898 ఏడి, పుష్ప 2 గురించి గత ఏడాది ఎక్కువగా చర్చ సాగింది. ఇవి రెండూ పెద్ద బడ్జెట్ సినిమాలు.
కల్కి 2898 ఏడి, పుష్ప 2 గురించి గత ఏడాది ఎక్కువగా చర్చ సాగింది. ఇవి రెండూ పెద్ద బడ్జెట్ సినిమాలు. దానికి భిన్నంగా 2024 ఆరంభంలోనే ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మినీ బడ్జెట్ చిత్రం `హనుమాన్` గ్రాండ్ సక్సెస్ పాన్ ఇండియాలో చర్చగా మారింది. ఏడాది ముగింపులోను ఒక మినీ బడ్జెట్ సినిమా గురించి అదే తరహాలో చర్చించుకున్నారు. ఇది మలయాళ యాక్షన్ చిత్రం- మార్కో. ఉన్నిముకుందన్ కథానాయకుడు. ఈ సినిమా భారీ యాక్షన్, మితిమీరిన రక్తపాతం, హింసతో రూపొందించినా కానీ, ఇది మాస్ కి విపరీతంగా నచ్చింది.
కేవలం దక్షిణాదిన మాత్రమే కాదు, ఉత్తరాదిన కూడా ఈ సినిమాకి అద్బుతమైన కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఉన్ని ముకుందన్ లాంటి ఒక చిన్న హీరో సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరుకుని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా మొదటి రోజు కేరళలో 5కోట్ల లోపు వసూలు చేయగా, హిందీలో 5 లక్షలు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు ఏకంగా 9 కోట్ల వరకూ వసూలు చేయగలిగింది అంటే అది మౌత్ టాక్ వల్లనే సాధ్యమైంది. ముఖ్యంగా ఈ యాక్షన్ సినిమా ఉత్తరాదిన మాస్ కి బాగా కనెక్టయింది. దీంతో కలెక్షన్స్ అమాంతం పెరిగాయి. బలమైన మౌత్ టాక్ రావడంతో అక్కడి నుంచి రైజ్ అయ్యి రిలీజైన 26వ రోజుకే 100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఈ విజయంతో యాక్షన్ చిత్రాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయి ఆదరణ ఉంటుందో మరోమారు నిరూపణ అయింది. తాజా ఇంటర్వ్యూలో తన సినిమా విజయంపై ఎంతో ఆనందంగా ఉన్న ఉన్ని ముకందన్ ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు. వాస్తవానికి మలయాళ చిత్రాలు హిందీ ఆడియెన్‌ని అంతగా ఆకర్షించలేకపోవడానికి కారణమేమిటి? అని ప్రశ్నించగా, భారీ యాక్షన్ చిత్రాలు తెరకెక్కకపోవడం, అలాగే బడ్జెట్ లేకపోవడం కూడా ప్రధాన కారణం అని విశ్లేషించారు.
నిజానికి మలయాళంలో పరిమిత బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉంటారు. అదుపు తప్పిన భారీ బడ్జెట్లను కుమ్మరించడం కంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసేందుకే మొగ్గు చూపుతారు. దానికి భిన్నంగా ఇప్పుడు భారీ యాక్షన్ చిత్రాల్లో పెద్ద మల్లూ స్టార్లు నటించాల్సి ఉందని కూడా ముకుందన్ అభిప్రాయపడ్డారు. పెద్ద హీరోల మద్ధతు ఉన్న సినిమాలు పెద్ద స్థాయికి చేరుకుంటాయని అన్నారు. అలాగే దక్షిణాదిన అన్ని భాషల చిత్రాలను ఆడియెన్ ఆదరిస్తారని కూడా వ్యాఖ్యానించారు. హిందీలో తెలివైన ప్రేక్షకులు ఉన్నారని, వారికి ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలో కూడా బాగా తెలుసునని ఉన్ని ముకుందన్ విశ్లేషించారు.