మలయాళ ఇండస్ట్రీపై 'మార్కో' హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సౌత్ సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర డామినేషన్ చూపిస్తున్నాయి. తెలుగు, కన్నడ చిత్రాలు నార్త్ బెల్ట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి

Update: 2025-01-17 03:00 GMT

సౌత్ సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర డామినేషన్ చూపిస్తున్నాయి. తెలుగు, కన్నడ చిత్రాలు నార్త్ బెల్ట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. కానీ తమిళ, మలయాళ మూవీస్ మాత్రం ఇంకా మైలురాయి మార్క్ ను అందుకోలేకపోతున్నాయి. మలయాళ చిత్రాలకు హిందీలో పెద్దగా మార్కెట్ లేకపోవడానికి గల కారణాలను మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ విశ్లేషించారు.

మలయాళ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాల కంటే, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు తీయడానికే ఫిలిం మేకర్స్ ప్రాధాన్యత ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే తమ దగ్గర బడ్జెట్ అనేది ప్రధాన సమస్య అని ఉన్ని ముకుందన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిర్మాతలు ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే ఆలోచిస్తారని, ఇంతకుముందు ఎవరైనా అధిక బడ్జెట్ ఖర్చు చేసి హిట్ కొట్టారా లేదా? అని ఉదాహరణలు వెతుకుతారని అన్నారు.

ఇటీవల 'మార్కో' వంటి మోస్ట్ వైలైంట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఉన్ని ముకుందన్.. ఏదైనా సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించాలంటే అందులో తప్పకుండా యాక్షన్ ఉండాల్సిందేనని అభిప్రాయ పడుతున్నారు. యాక్షన్ సినిమాలను ఎక్కువ మంది ప్రేక్షకులు ఇష్టపడతారు. అలాంటి హై ఇంటెన్స్ యాక్షన్ కథాంశమున్న సినిమాలు తీయాలంటే ముందుగా ఒక స్టార్ హీరో కావాలి.. అందరూ మెచ్చే బలమైన స్క్రిప్ట్ కావాలి.. సినిమాను భారీ స్థాయిలో నిర్మించే నిర్మాత కావాలి. ఇలా చాలా అంశాలు అనుకూలిస్తేనే అది సాధ్యమవుతుందని ముకుందన్ చెప్పుకొచ్చారు.

నిజానికి మలయాళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కలెక్ట్ చేయకపోయినా.. ఉన్నంతలో బాగానే వసూళ్లు రాబడుతున్నాయి. 2024లో తక్కువ బడ్జెట్ లో తీసిన అనేక మలయాళ చిత్రాలు ఘన విజయం సాధించాయి. కేవలం ₹20 కోట్ల తో తెరకెక్కించిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ.. వరల్డ్ వైడ్ గా ₹240 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తద్వారా 200+ కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి మాలీవుడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం), ఆవేశం, ప్రేమలు, ఏఆర్ఎమ్ వంటి చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. కిష్కింద కాండం, భ్రమయుగం, గురువాయూర్ అంబలనడయిల్, వర్షంగళక్కు శేషం, టర్బో, అన్వేషిప్పిమ్‌ కండెతుమ్‌ లాంటి మరికొన్ని మలయాళ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేశాయి. చివరగా క్రిస్మస్ స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చిన 'మార్కో' మూవీ కూడా 100 కోట్ల మైల్ స్టోన్ మార్క్ ను క్రాస్ చేయడం విశేషం.

'జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’, ‘యశోద’ వంటి చిత్రాలతో ఉన్ని ముకుందన్ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హనీఫ్ అదేని దర్శకత్వంలో ఆయన నటించిన 'మార్కో' మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ముకుందన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీనికి నిర్మాత కూడా అతనే కావడం గమనార్హం. ప్రస్తుతం గెట్ సెట్ బేబీ అనే సినిమా చేస్తున్న ఉన్ని.. త్వరలో మార్కోకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News