'పుష్ప 2'.. దేవీశ్రీ పాటలు.. థమన్ బీజీఎమ్?

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Update: 2024-11-07 07:39 GMT

'పుష్ప 2: ది రూల్' రిలీజ్ కు ఇంకా నెల రోజుల టైం కూడా లేదు. కానీ ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఐటెం సాంగ్ ఒక్కటీ పెండింగ్ ఉంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో శ్రీలీలతో ఈ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యూఎస్ఏ ప్రీమియర్ సేల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. పాన్ ఇండియా ప్రమోషన్స్ కోసం మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో.. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమా గురించి వచ్చిన ఓ రూమర్ ఇండస్ట్రీలో కలవరం రేపుతోంది.

'పుష్ప 2' సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే డీఎస్పీతో కాకుండా ఎస్. థమన్ తో ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించబోతున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు తమన్ తో పాటుగా 'కాంతారా' ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ కూడా బీజీఎమ్ కోసం వర్క్ చేస్తున్నట్లుగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.

దేవిశ్రీ బీజీఎమ్ పట్ల హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే వేరే మ్యూజిక్ కంపోజర్స్ తో చేయించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఆల్రెడీ 'పుష్ప 2'లో కొంత భాగానికి దేవి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయగా.. మిగిలి ఉన్న భాగానికి థమన్, అజనీష్ లోక్ నాథ్ పని చేస్తారని.. ఇద్దరికీ వర్క్ డివైడ్ చేసి ఇచ్చారని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.

బన్నీ, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్.. టాలీవుడ్ లో ఈ ముగ్గురిదీ హిట్ కాంబినేషన్. 'ఆర్య' 'ఆర్య 2' 'పుష్ప 1' సినిమాల ఆల్బమ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. 'పుష్ప: ది రైజ్' కోసం డీఎస్పీ ఇచ్చిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం అప్పట్లోనే నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కొన్ని చోట్ల మినహా సినిమాలో బీజీఎమ్ ఏమంత గొప్పగా లేదనే విమర్శలు వచ్చాయి. కానీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆ తర్వాత దేవిశ్రీకి నేషనల్ ఫిలిం అవార్డు రావడంతో ఎవరూ దాని గురించి మాట్లాడలేదు.

ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో, హైప్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. మంచి సాంగ్స్ తో పాటుగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే పాటల విషయంలో దేవిశ్రీ ప్రసాద్ నూటికి నూరు మార్కులు అందుకున్నారట కానీ, బీజీఎమ్ విషయంలో మాత్రం ఫుల్ మార్కులు స్కోర్ చేయలేకపోతున్నారట. అందుకే 'పుష్ప 1'కు వినిపించిన కామెంట్స్ ఈ సీక్వెల్ కు వినిపించకూడదని, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో కొట్టించాలని సుక్కూ అండ్ టీమ్ నిర్ణయం తీసుకున్నారని రూమర్స్ వస్తున్నాయి. దేవిశ్రీ ఇతర ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ సమయం కూర్చోవడం కూడా దీనికి మరో కారణమని అంటున్నారు.

మాములుగా ఒకే సినిమాకి ముగ్గురు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేసే ట్రెండ్ బాలీవుడ్ లో ఉంది. సాంగ్స్ ఒకరు కంపోజ్ చేస్తే, బీజీఎమ్ ఇంకొకరు ఇస్తుంటారు. ఒక్కోసారి పాటకి ఒక సంగీత దర్శకుడిని కూడా పెట్టుకుంటారు. తెలుగులో కొన్ని సినిమాల విషయంలో అలానే చేసారు. ఇప్పుడు 'పుష్ప 2' లో పాటలు దేవిశ్రీ అందిస్తే, బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం థమన్, అజనీష్ చేతిలో పెడుతున్నారని అంటున్నారు. థమన్ గతంలో అనేక చిత్రాలకు కేవలం బీజీఎమ్ కోసం వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికైతే 'పుష్ప: ది రూల్' స్కోర్ ను దేవిశ్రీ ప్రసాద్ తో కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయిస్తున్నారనే వార్తలపై ధ్రువీకరణ రాలేదు. ఏదేమైనా ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేసినా.. అవుట్ ఫుట్ బాగుంటే అదే చాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News