ఆ సంస్థ‌కి స్టార్ హీరోలు క‌లిసి రాలేదే!

అప్ప‌టి నుంచి ఉషాకిర‌ణ్ మూవీస్ స్టార్ హీరోల‌పై దృష్టి పెట్ట‌డం పూర్తిగా మానేసింది. కొత్త వాళ్ల‌తోనే ఉత్త‌మం అని వాళ్ల‌తోనే సినిమాలు నిర్మించి మార్కెట్ లో ఓ బ్రాండ్ గా నిలిచింది.

Update: 2024-06-10 04:18 GMT

రామోజీరావు ఉషాకిర‌ణ్ మూవీస్ ఎన్నో సినిమాలు నిర్మించింది. ఎంతో మంది కొత్త వారిని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేసింది. వాటిలో చాలా సినిమాలు మంచి ఫ‌లితాలు సాధించాయి. అయితే ఉషాకిర‌ణ్ మూవీస్ మాత్రం అప్ప‌టి స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాలంటే ఎందుక‌నో ఆలోచించింద‌నే చెప్పాలి. ఎందుకంటే అందులో కేవ‌లం నాగార్జున హీరోగా ఒకే ఒక్క చిత్రం చేసారు త‌ప్ప అప్ప‌టి స్టార్ హీరోలైనా మెగాస్టార్ చిరంజీవి గానీ, విక్ట‌రీ వెంక‌టేష్ గానీ, న‌ట‌సింహ బాల‌కృష్ణ‌గానీ ఎవ‌రూ ఆ సంస్థ‌లో సినిమాలు చేయ‌లేదు.

రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటైన కొత్త‌లో 2001 లో నాగార్జున తో సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శక‌త్వంలో 'ఆకాశ‌వీధిలో' అనే సినిమా చేసారు. ఓ స్టార్ హీరోతో ఉషాకిర‌ణ్ మూవీస్ చేసిన తొలి ప్ర‌య‌త్నం అది. కానీ ఆ సినిమా దారుణ‌మైన ఫ‌లితాన్ని అందించింది. ఎం.ఎం. కీర‌వాణి లాంటి సంగీత ద‌ర్శ‌కులు సంగీతం అందించారు. కానీ ఏ ర‌కంగానూ సినిమా విజ‌యం అంచున క‌నిపించ‌లేదు. ఆ ర‌కంగా నాగార్జున కెరీర్ లో అదో డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది.

ఇంకా అప్పుడు ఫాంలో ఉన్న రాజశేఖర్ హీరోగా 'మెకానిక్ మావయ్య', జగపతిబాబు హీరోగా 'మూడుముక్కలాట', రవితేజ తో 'ఒక రాజు ఒక రాణి' లాంటి సినిమాలు కూడా ఉషాకిర‌ణ్ నిర్మించింది. కానీ అవి డిజాస్ట‌ర్లే. ఆ ర‌కంగా స్టార్ హీరోల‌తో ఆ సంస్థ చేసిన సినిమాలేవి విజ‌యం సాధించ‌లేదు. అప్ప‌టి నుంచి ఉషాకిర‌ణ్ మూవీస్ స్టార్ హీరోల‌పై దృష్టి పెట్ట‌డం పూర్తిగా మానేసింది. కొత్త వాళ్ల‌తోనే ఉత్త‌మం అని వాళ్ల‌తోనే సినిమాలు నిర్మించి మార్కెట్ లో ఓ బ్రాండ్ గా నిలిచింది.

ఆ సినిమాలే ఆ సంస్థ‌కు భారీగా లాభాలు తెచ్చి పెట్టాయి. చిన్న సినిమా క‌థ‌లే సంస్థ‌కు పెద్ద పీఠ‌గా నిలిచాయి. అంతకు మించి ఎక్కువ‌గా సీరియ‌ళ్ల తో తెలుగు లోగిళ్ల‌లో ఫేమ‌స్ అయింది. ఈటీవీ సీరియ‌ల్స్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా నిలిచాయి. ఇప్ప‌టికీ అదే ట్రెండ్ ని కొన‌సాగిస్తుంది. ఎంతో మంది టీవీ ఆర్టిస్టుల‌కు రామోజీ సంస్థ జీవితాన్ని ప్ర‌సాదించింద‌ని చెప్పొచ్చు.

Tags:    

Similar News