పర్ఫెక్ట్ వాలెంటైన్ రీ-రిలీజ్ మూవీ ఏదంటే?

టాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ప్రారంభమైన రీ-రిలీజుల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Update: 2024-02-13 04:30 GMT

టాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ప్రారంభమైన రీ-రిలీజుల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గతేడాది కొన్ని పాత ఫ్లాప్ సినిమాలను కూడా మరోసారి విడుదల చేయడంతో, ఒకానొక దశలో ఈ ట్రెండ్ కు బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. సమయం సందర్భం లేకుండా సినిమాలను మళ్లీ మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రీ రిలీజులకు ఒక మంచి సందర్భం వచ్చింది. అదే వాలెంటైన్స్ డే. ప్రేమికుల దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి ఈ ఫిబ్రవరి 14న ఏకంగా 10కి పైగా సూపర్ హిట్ సినిమాలను రీ-రిలీజ్ కు రెడీ చేశారు. అవేంటంటే...

‘ఓయ్‌’:

బొమ్మరిల్లు సిద్దార్థ్, షామిలీ హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ స్టోరీ ‘ఓయ్‌’. ఆనంద్‌ రంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2009లో రిలీజైంది. అప్పుడు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ, తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ అందుకుంది. లవర్స్ కు ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోయే ఈ మూవీ రీ-రిలీజ్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న మరోసారి థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

‘సూర్య S/O కృష్ణన్‌’

తమిళ హీరో సూర్య నటించిన ఫీల్‌ గుడ్‌ లవ్ స్టోరీ ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్‌ వాసుదేవ్ మేనన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సిమ్రన్‌, సమీరారెడ్డి, దివ్యా శ్రీపాద కథానాయికలుగా నటించారు. 2008లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. గతేడాది ఆగస్టులో రీ రిలీజ్ చేయగా, తెలుగు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. అయితే ఆరు నెలలు తిరక్కుండా ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

‘సీతారామం’:

హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ 'సీతారామం’. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా.. రష్మిక మందన్న కీలక పాత్ర పోషించింది. యుద్ధంతో రాసిన ప్రేమకథా అంటూ 2022 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. సినీ ప్రియుల హృదయాలను దోచేసింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా రీ-రిలీజ్‌ చేస్తున్నారు.

'బేబీ':

చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ వద్ద కల్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ఆశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2023 జూలై 14న థియేటర్లలోకి వచ్చి, వరల్డ్ వైడ్ గా 90 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. 'మొదటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వితంగా సమాధి చేయబడి ఉంటుంది' అంటూ మరోసారి అలరించడానికి సిద్ధమైంది.

'తొలిప్రేమ':

పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన లవ్ స్టోరీ 'తొలి ప్రేమ'. 1998లో ఎ. కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ లో కొన్ని సెలెక్టెడ్ స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు.

‘96’:

విజయ్‌ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ లవ్ డ్రామా ‘96’. 2018లో వచ్చిన ఈ సినిమా త‌మిళంలో క్లాసిక్‌గా నిలిచిపోయింది. దీన్నే తెలుగులో శర్వానంద్, సమంతలతో ‘జాను’ చిత్రంగా రీమేక్ చేశారు నిర్మాత దిల్‌ రాజు. ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ‘96’ మళ్లీ రిలీజ్ కానుంది.

వీటితో పాటుగా సిద్ధార్థ, త్రిష జంటగా నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’.. శర్వానంద్‌, అనన్య, జై, అంజలి కలిసి నటించిన ‘జర్నీ’ సినిమాలు ఫిబ్రవరి 14న రీరిలీజ్‌ అవుతాయంటూ ఆ మధ్య పోస్టర్లు విడుదల చేశారు. ఇక ఎవర్ గ్రీన్ హలీవుడ్ కల్ట్ లవ్ స్టోరీ 'టైటానిక్'.. షారుఖ్ ఖాన్ నటించిన కల్ట్ క్లాసిక్ దిల్ వాలే దునియా లే జాయేంగే' కూడా రీ-రిలీజ్ కాబోతున్నాయి. అలానే జబ్ వివ్ మెట్, వీర్ జారా, మొహాబ్బత్తే లాంటి హిందీ మూవీస్ సైతం పీవీఆర్ ఐనాక్స్ లో ప్రదర్శించబడనున్నాయి. ప్రేమికులు ఈ డజను చిత్రాల్లో వేటిని ఆదరిస్తారో చూడాలి.

Tags:    

Similar News