50 ఏళ్ల క్రితం మట్కా స్టార్ ఇలా ఉండేవాడా?
ఘోరమైన వైఫల్యాలతో మార్కెట్ పై కూడా ప్రభావం పడుతుందనే అంచనాలు తెరపైకి వస్తున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాన్సంట్రేషన్ అంతా ఇప్పుడు 'మట్కా' పైనే ఉన్న సంగతి తెలిసిందే. వరుణ్ కెరీర్ లో తొలి భారీ బడ్జెట్ , పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే. ఈ సినిమా సక్సెస్ అంతే కీలకం. ఇటీవల అతడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఘోరమైన వైఫల్యాలతో మార్కెట్ పై కూడా ప్రభావం పడుతుందనే అంచనాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో మట్కాతో సక్సెస్ కొట్టి రేసులోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందుకు తగ్గట్టే సినిమా కూడా అంతే సవాల్ గా మారింది. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు విభిన్న గెటప్ ల్లో కనిపించాల్సి ఉంది. దీనిలో భాగంగా లుక్ పరంగా రకరకాల మార్పులు చేయాల్సి వస్తోంది. ఏకంగా 50 క్రితం నాటి స్టోరీ కావడంతో అప్పటి వాతావరణాన్ని తగ్గట్టు మౌల్డ్ అవుతున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ జిమ్ లో ఉన్న ఓ పిక్ లీకైంది. ఇందులో వరుణ్ తేజ్ క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు.
అలాగే రింగులు తిరిగిన జుత్తు చూడొచ్చు. హెయిర్ స్టైల్ పూర్తిగా ఓల్డ్ జనరేషన్ ని తలపిస్తుంది. దీంతో సినిమాలో ఇదొక రకమైన గెటప్ అయి ఉండొచ్చు. ప్రస్తుతం షూట్ కోసం ఇలాగే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ అంతా దాదాపు హైదరాబాద్ లో వైజాగ్ సెట్లు వేసి చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. 50 క్రితం నాటి వైజాగ్ నే ఆ సెట్లు తలపిస్తున్నాయని చూసిన వాళ్లు చెబుతున్నారు.
ఇక జిమ్ బాడీ కోసం వరుణ్ గత సినిమాల కోసం అంతే కష్ట పడాల్సి వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా చేసిన సంగతి తెలిసిందే. అందులో బాక్సర్ రోల్ కావడంతో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని మరీ చేసాడు. ఆతర్వాత ఎయిర్ పోర్స్ బ్యాక్ డ్రాప్ లోచేసిన 'ఆపరేషన్ వాలంటైన్' కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. లుక్ పరంగా మంచి ఫిజిక్ మెయింటెన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా రెగ్యులర్ జిమ్ తప్పలేదు. మళ్లీ ఇప్పుడు మట్కా కోసం జిమ్ములో కసరత్తులు చేయాల్సి వస్తోంది.