F4, F10, సంక్రాంతి సినిమాలు వస్తూనే ఉంటాయి: వెంకటేశ్

ఈ సందర్భంలో వెంకీ మాట్లాడుతూ 'ఎఫ్ 2'కి కొనసాగింపుగా 'ఎఫ్ 4' నుంచి 'ఎఫ్ 10' వరకూ, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు వస్తూనే ఉంటాయని అన్నారు.

Update: 2025-01-17 11:25 GMT

2024 సంక్రాంతికి 'సైంధవ్‌' సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్.. ఈ పండక్కి 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ విక్టరీ సాధించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్.. బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. నార్త్ అమెరికాలో రెండు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్ లో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంలో వెంకీ మాట్లాడుతూ 'ఎఫ్ 2'కి కొనసాగింపుగా 'ఎఫ్ 4' నుంచి 'ఎఫ్ 10' వరకూ, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు వస్తూనే ఉంటాయని అన్నారు.

''జనరల్ గానే నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఇది నా కెరీర్‌లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే మనం కష్టపడి పనిచేస్తూ ఉంటే, దానికి తగిన సక్సెస్‌ వస్తుందని నేను నమ్ముతాను. అదే మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఈ విజయం మాది మాత్రమే కాదు. మాపై ప్రేమ చూపించి, ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానుల వల్లనే ఈ సక్సెస్ సాధ్యమైంది. ఇదంతా మీ సక్సెస్. మేము ఇందులో ఒక చిన్న భాగం మాత్రమే. మీరు కోరుకుంటేనే ఆ ఎనర్జీ వస్తుంది. మొదటి రోజు నుంచే నాకు ఆ ఎనర్జీ వచ్చింది. అనిల్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచే నాకు ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఏదైనా సమ్ థింగ్ అవుట్ స్టాండింగ్ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. మీ అందరి పాజిటివ్ వైబ్స్, ఎనర్జీ కారణంగానే మేము ఈ సినిమా తీసాం. 'సంక్రాంతికి వస్తున్నాం' అని చెప్పాం.. మీరూ వచ్చి ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. తోటి నటీనటులు, టెక్నిషియన్స్, రైటింగ్ టీమ్, డైరెక్టర్ అనిల్, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు - శిరీష్ లకు స్పెషల్ థ్యాంక్స్'' అని వెంకటేశ్ అన్నారు.

''నాకు స్క్రీన్ మీద టైమింగ్ వస్తుంది కానీ, మైక్ పట్టుకుంటేనే కొంచం ఇదిగా ఉంటుంది. అనిల్ తో 'ఎఫ్ 4' మాత్రమే కాదు 'ఎఫ్ 10', 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. మేం ఇస్తూనే ఉంటాం. మీరు ప్రేమగా అడిగితే అనిల్ అలాంటి సినిమాలు తీస్తూనే ఉంటాడు. 'ఘర్షణ' లాంటి మూవీ చేయాలంటే సిక్స్ ప్యాక్ ఉండాలి.. అలాంటివి ఇప్పుడు కష్టం. ఈసారి తొడల్లో సిక్స్ ప్యాక్ చూపించాను (నవ్వుతూ). నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది వండర్ ఫుల్ మూమెంట్. పాజిటివ్ రివ్యూలు ఇచ్చి ఈ సినిమాని ఎంకరేజ్ చేసిన మీడియాకి కృతజ్ఞతలు. ఫోన్లు చేసి మనస్ఫూర్తిగా అభినందించిన సినీ ప్రముఖులకు థ్యాంక్స్. ఫిలిం ఇండస్ట్రీలో అందరూ తమ ఫ్యామిలీలతో వెళ్లి సినిమా చూసారు. ఒక్కరు ఇద్దరు కాదు పది మంది కలిసి వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది. మా చిన్నోడు మహేష్ బాబుకి థ్యాంక్యూ. సినిమా చూసి ట్వీట్ చేసారు. అతనికి సినిమా అంత బాగా నచ్చినందుకు హ్యాపీగా ఉన్నాను''అంటూ వెంకీ తన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. నేను చేసిన ఒక వెబ్ సిరీస్ చూసి అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం'లో భాగ్యం క్యారక్టర్ ఆఫర్ చేసినట్లుగా తెలిపింది. తాను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇదే చాలా టఫ్ క్యారక్టర్ అని, ఈ సినిమా వల్ల తనకు ఎలాంటి పేరు వచ్చినా ఆ క్రెడిట్ మొత్తం అనిల్‌ రావిపూడికే చెందుతుందని చెప్పింది. డైరెక్టర్ చెప్పిన దాంట్లో 20 శాతం మాత్రమే చేశాననని, 100 శాతం చేసి ఉంటే ఇంకా బాగుండేదని నవ్వుతూ తెలిపింది. వెంకటేశ్ తనకు గురువుతో సమానమని, ఆయనతో కలిసి నటించడం తనకు దక్కిన అదృష్టమని, ఈ సినిమా హిట్ కావడానికి ఆయనే ప్రధాన కారణమని ఐశ్వర్య పేర్కొంది. తాను ఇప్పటి వరకు 40 సినిమాల్లో నటిస్తే, 'సంక్రాంతికి వస్తున్నాం' విషయంలోనే తన తల్లి చాలా ఆనందించారని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News