ఆధ్యాత్మిక చింత‌న‌తో ఫోన్ల‌కు దూర‌మైన హీరో?

స్మార్ట్ ఫోన్ లేనిదే నిమిష‌మైనా గ‌డ‌వ‌దు. అంతగా ప్ర‌జా జీవితాలతో ఆడుకుంటోంది సెల్ ఫోన్. ప్ర‌పంచంలో మారుమూల గ్రామాల్లో, కొండ‌కోనల్లో, అడవుల్లోను ఫోన్లు ఉప‌యోగిస్తున్నారు.

Update: 2023-11-13 05:43 GMT

స్మార్ట్ ఫోన్ లేనిదే నిమిష‌మైనా గ‌డ‌వ‌దు. అంతగా ప్ర‌జా జీవితాలతో ఆడుకుంటోంది సెల్ ఫోన్. ప్ర‌పంచంలో మారుమూల గ్రామాల్లో, కొండ‌కోనల్లో, అడవుల్లోను ఫోన్లు ఉప‌యోగిస్తున్నారు. క్ష‌ణాల్లో ఎలాంటి స‌మాచారం అయినా ఫోన్ లో తెలిసిపోతోంది. అయితే ప్ర‌పంచం ఇంత‌గా అభివృద్ధి చెందినా ఇలాంటి డిజిట‌ల్ విప్ల‌వాన్ని, సెల్ ఫోన్ విప్ల‌వాన్ని వ‌దిలి కొంతైనా ప్ర‌శాంత జీవ‌నం కావాల‌నుకునే ఒక సెక్ష‌న్ ప్ర‌జ‌లు కూడా ఉన్నారు.

ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్ లాంటి సెల‌బ్రిటీ కూడా ఉన్నారు. సాటి హీరోలంతా ఖ‌రీదైన యాపిల్ ఫోన్లు ఉప‌యోగిస్తున్నా కానీ, ఆయ‌న అస‌లు చేతిలో ఫోన్ ఉంచుకునేందుకే అంత‌గా ఇష్ట‌ప‌డ‌రని చెబుతారు. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ దీపావ‌ళి పార్టీలో సెల‌బ్రిటీలంతా సంద‌డి చేసారు. వారితో పాటే వెంకీ కూడా ఈ పార్టీలో క‌నిపించారు. ఆయ‌న చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. కానీ అది ఒక సాధార‌ణ యాండ్రాయిడ్ ఫోన్. పైగా ఆ ఫోన్ బ్రేక్ అయి క‌నిపిస్తోంది. అంటే త‌న ఫోన్ గురించి వెంకీ అంత‌గా చింతించిన‌ట్టు క‌నిపించ‌లేదు.

పైగా ల‌గ్జ‌రీ లుక్ క‌నిపించేందుకు, లేదా యాపిల్ ఫోన్ చేతిలో ఉండాల‌ని కూడా ఆయ‌న అనుకోలేదు. కానీ త‌న‌తో పాటే ఉన్న ఇత‌ర స్టార్ హీరోల చేతిలో ఖ‌రీదైన లేటెస్ట్ యాపిల్ ఫోన్లు క‌నిపించాయి. వారి మెయింటెనెన్స్ కూడా వెంకీతో పోలిస్తే చాలా ఎక్కువ‌. వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ వెంకీ సింప్లిసిటీ గురించి ఈ పార్టీలో చ‌ర్చ సాగింది. ఇక‌పోతే విక్ట‌రీ వెంక‌టేష్ గురించి స‌న్నిహితంగా తెలిసిన‌వారు ఆయ‌న సింప్లిసిటీ ఆధ్యాత్మిక చింత‌న గురించి ఎక్కువ‌గా మాట్లాడుతారు. ఒక్కో సినిమాకి కోట్ల‌లో పారితోషికం అందుతున్నా కానీ, ఆ పారితోషికం అందుకునేది వెంకీ కాదు. ఆయ‌న సోద‌రుడు నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది? అని కూడా వెంకీ ఆరా తీయ‌ర‌ని కూడా గుస‌గుస‌లు ఉన్నాయి. ఆస్తులు అంత‌స్తులు అప్ర‌శాంత‌త‌కు ఆయ‌న బ‌హుదూరం. ముఖ్యంగా వివేకానందుడు, రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస వంటి మ‌హానుభావుల‌కు అనుచ‌రుడిగా వెంకీలో ఆధ్యాత్మిక వైజ్ఞానిక చింత‌న అమోఘ‌మైన‌ది.

ప్ర‌తియేటా విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా తెలుగు సినీజ‌ర్న‌లిస్టులు ఈ విష‌యమై ప్ర‌త్యేకించి వెంకీని ప్ర‌శ్నిస్తుంటారు. వెంకీ కూడా ఆధ్మాత్మిక కోణం గురించి మంచి విష‌యాలు చెబుతారు. ప్ర‌పంచంలోని ఇత‌రుల‌ బాధ‌ల‌న్నీ నాకే కావాలి! అంటూ ప్ర‌తిదీ నెత్తిన వేసుకునేవాడికి అది పెద్ద గుదిబండ‌గా మారుతుంద‌న్న‌ వివేకానందుని సూక్తిని కూడా గుర్తు చేస్తుంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కి కూడా ఇదే వ‌ర్తిస్తుందేమో!

Tags:    

Similar News