తెలుగు సినిమా సంచలనం రేంజ్‌ ఇది

Update: 2015-07-17 13:41 GMT

ఏ నోట విన్నా బాహుబలి రికార్డుల మాటే. ఇంటా బైటా రికార్డులే రికార్డులు. మొదటివారం కలెక్షన్ల రిపోర్ట్‌ వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం బాహుబలి తొలి ఏడు రోజుల్లో స్వదేశంలో సాధించిన మొత్తం వసూళ్లు రూ.180కోట్లు. అది కూడా పన్నులు కోత వేయగా వచ్చిన నెట్‌ కలెక్షన్లు ఇవి.

నైజాం ఏరియాలో ఇప్పటికే దిల్‌రాజు సంచుల కొద్దీ సొమ్ముల్ని నొల్లుకుంటున్నాడు. 24కోట్లు వెచ్చించి హక్కులు కొనుక్కున్నందుకు తొలి వారంలోనే ఆ మొత్తం వచ్చేసింది. ఇప్పటికే 21కోట్లు వసూలు చేసింది. సోమవారానికి బ్యాలెన్స్‌ కలెక్ట్‌ చేస్తుంది. ఇక మిగిలింది అంతా (బ్రేక్‌ ఈవెన్‌) లాభమే. సీడెడ్‌లో 12.10 కోట్లకు హక్కులు కొనుక్కుంటే 11.50కోట్లు వసూలైంది. ఫుల్‌రన్‌లో ఇక నుంచి లాభాల్ని షేర్‌ చేసుకోవడమే మిగిలింది. గుంటూరు పంపిణీదారుడికి రెండో వారం నాటికి బ్రేక్‌ ఈవెన్‌ వస్తుంది. మూడో వారం నుంచి అన్నీ మిగుళ్లే. మిగతా ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించాల్సి ఉంది.

ఇక ఓవర్‌సీస్‌ లెక్కలు తీస్తే అక్కడ లాభాల పంట పండింది. మొదటి వారంలోనే 60లక్షల డాలర్లు వసూలు చేసి పెట్టుబడికి డబుల్‌ రాబడి తెచ్చిపెట్టింది. ఇక ముందు ఇంకెంత వసూలు చేస్తుందో అంచనాలకే అందనిది. అలాగే హిందీ వెర్షన్‌ ఇంతవరకూ ఏ సౌత్‌ సినిమా చేయనంత భారీ మొత్తాన్ని వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక్క వారంలో రూ.40 కోట్ల వసూళ్లతో దుమ్ము దులిపేసింది. కర్నాటక, ఉత్తరమెరికా లాంటిచోట రికార్డులే రికార్డులు.

మునుముందు మరిన్ని లెక్కలు తేల్చాల్సి ఉంది. ఇవన్నీ లెక్కపెడుతుంటే అసలు ఓ ప్రాంతీయ సినిమా ఈ స్థాయి సంచలనం సృష్టించడం 80ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగనిది. హ్యాట్సాఫ్‌ టు రాజమౌళి.

Tags:    

Similar News