సూపర్ స్టార్ మూవీ ఓటీటీ అప్‌డేట్ వచ్చేసిందోచ్...
థియేటర్ లో విడుదల అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన 'ది గోట్' సెప్టెంబర్ 5వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు తమిళనాట రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పటిలాగే సినిమా కు నిరాశే మిగిలింది. ఆకట్టుకునే కథ ఉన్నా దాన్ని దర్శకుడు మలచిన తీరు బాగాలేదు అంటూ చాలా మంది తెలుగు ప్రేక్షకులు పెదవి విరిచారు. కానీ థియేటర్ లో చూడని చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఓటీటీ ల్లో చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు.
థియేటర్ లో విడుదల అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ వారంలోనే అంటే అక్టోబర్ 3వ తారీకున ది గోట్ సినిమా స్ట్రీమింగ్ మొదలు కాబోతుంది. కేవలం తమిళ్ లోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులో ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. విజయ్ డ్యుయెల్ రోల్ లో నటించిన ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. సినిమా కి ఓ రేంజ్ లో తమిళనాట వసూళ్లు వచ్చినా అక్కడ సైతం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
విజయ్ రాజకీయాల్లో అరంగేట్రం చేశాడు. ఇటీవలే పార్టీ ని ప్రకటించాడు, జెండా ను సైతం విడుదల చేయడం జరిగింది. పార్టీని వచ్చే ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో విజయ్ వర్క్ చేస్తున్నాడు. సినిమాల్లో ఆయన ఇక పై నటించక పోవచ్చు అనే వార్తలు వచ్చాయి. దాంతో ది గోట్ సినిమా ఆయనకు చివరి మూవీ అనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మరో సినిమాను ఆయన ప్రకటించాడు. అదే ఆయన చేయబోతున్న చివరి సినిమాగా తెలుస్తోంది. ది గోట్ సినిమా సైతం ఆయన ఫ్యాన్స్ కు చాలా ముఖ్యమైన సినిమాగా చర్చ జరుగుతోంది.
ది గోట్ సినిమాలో విజయ్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. మరో విజయ్ పాత్రకు జోడీగా స్నేహా నటించింది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటుడు ప్రశాంత్ నటించాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, లారెన్స్ లో గెస్ట్ రోల్ లో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది అంటూ తమిళ సినీ ప్రేమికులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీ యాక్షన్ మూవీగా దాదాపు రూ.400 కోట్ల తో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది.