విజయ్.. ఆ క్రేజీ సీక్వెల్స్ పోయినట్లే..
మురుగదాస్ తుపాకీ 2, లోకేష్ లియో 2, విక్రమ్ 2, రాయప్పన్ సీక్వెల్, విజయ్, షారుఖ్ కాంబోలో చేయాల్సిన మూవీ, అలాగే వెట్రిమారన్ తో ఒక సినిమా ఉంది.
ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆఖరులో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదిలా ఉంటే తమిళ్ రాజకీయాలలో చాలా కాలంగా విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజకీయాలలోకి వస్తాడనే ప్రచారం నడిచింది. ఈ కారణంగా విజయ్ తమిళనాడులో ప్రధాన పార్టీలకి టార్గెట్ అయ్యాడు కూడా.
రీసెంట్ గా ఎవరూ ఊహించని విధంగా విజయ్ రాజకీయాలలోకి రాబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా పార్టీ పేరు కూడా ఎనౌన్స్ చేశాడు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో తన పార్టీ పోటీ పడటం లేదని, 2027 ఎన్నికలలో అసెంబ్లీ బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంగా ఉన్న అన్నా డీఎంకే పార్టీని బలంగా నడిపించే నాయకత్వం లేదు.
ఒక రాజకీయ శూన్యత అయితే ఉంది. దీనిని బీజేపీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి సమయంలో ప్రజలలో మాస్ ఇమేజ్ తో పాటు సామాజిక సేవా కార్యక్రమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ పార్టీ పెట్టడం కచ్చితంగా సెన్సేషన్ అని చెప్పాలి. పూర్తిస్థాయిలో రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత సినిమాలు చేయనని విజయ్ ప్రకటించారు.
అదే జరిగితే వెంకట్ ప్రభుతో చేస్తోన్న మూవీనే విజయ్ చివరి చిత్రం అయ్యే అవకాశం ఉంది. విజయ్ తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు సిద్ధంగా ఉన్నారు. అలాగే సీక్వెల్స్ కూడా రెడీ అవుతున్నాయి. మురుగదాస్ తుపాకీ 2, లోకేష్ లియో 2, విక్రమ్ 2, రాయప్పన్ సీక్వెల్, విజయ్, షారుఖ్ కాంబోలో చేయాల్సిన మూవీ, అలాగే వెట్రిమారన్ తో ఒక సినిమా ఉంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
విజయ్ రాజకీయాలలోకి వెళ్తే ఈ ఏడు సినిమాల భవిష్యత్తు ఏంటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. విజయ్ కోసం సిద్ధం చేసుకున్న సీక్వెల్స్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆ దర్శకులు ఆలోచించుకుంటున్నారు. వీళ్ళలో ఎవరైన వెళ్లి విజయ్ తో కలిసి సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిక్వస్ట్ చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. అలాగే అభిమానులు కూడా విజయ్ సినిమాలు మానేస్తా అంటే ఒప్పుకోకపోవచ్చు. మరి విజయ్ సినిమా కెరియర్ ప్లానింగ్ ఎలా ఉంటుందనేది భవిష్యత్తులో ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.