దేశంలో పెద్ద డిబేట్ ప్రారంభం కావ‌డానికి విశాల్ కార‌కుడు!

విశాల్ మాట్లాడుతూ-''అతని(జోషి) మాటను బట్టి సరైన సమయంలో ఏ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. CBFC వారు సర్టిఫికేట్‌ను కొరియర్ చేస్తే అది మాకు ఎప్ప‌టికి అందుతుంది?

Update: 2023-10-05 04:26 GMT

ద‌క్షిణాది స్టార్ హీరో విశాల్ కేంద్రంలోని ''సీబీఎఫ్‌సి స‌ర్టిఫికేష‌న్'' వెన‌క అవినీతి గురించి తీవ్రంగా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. తన సినిమా 'మార్క్ ఆంటోని' హిందీ వెర్షన్ సెన్సార్ సర్టిఫికేట్ పొందడానికి రూ.6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని అత‌డు ఆరోపించాడు. ఈ వ్య‌వ‌హారంలో సీబీఎఫ్‌సి అధికారుల‌కు వ్య‌తిరేకంగా బాలీవుడ్ పెద్ద‌ల నుంచి విశాల్‌కి మ‌ద్ధ‌తు ల‌భించింది. దీనిపై భార‌త ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించడం సంచ‌ల‌న‌మైంది. తాజాగా ఈ అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

CBFC చీఫ్ ప్రసూన్ జోషి మాట్లాడుతూ, -''ఫీడ్‌బ్యాక్ (ఆరోప‌ణ‌ల్ని)ను తక్షణమే గుర్తించాం. సమస్య ఏమిట‌న్న‌ది పరిశోధిస్తున్నాం. మేము దీనికి కార‌ణ‌మైన సోర్స్ ఎక్క‌డుందో తెలుసుకుంటాం. తదనుగుణంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం'' అని ప్ర‌క‌టించారు. విశాల్ ఆరోపించిన‌ట్టు లంచం తీసుకున్న వారు ఎవ‌రూ సీబీఎఫ్‌సీ అధికారులు కాదని అనధికారిక థర్డ్‌పార్టీ మధ్యవర్తులు అని సీబీఎఫ్‌సి అధికారిక‌ ప్ర‌క‌ట‌న పేర్కొంది. వంద‌లాది సినిమాలు సర్టిఫికేట్ పొందుతాయి కాబట్టి ఆ మేర‌కు త‌మ‌పై ఒత్తిడి ఉంటుంద‌ని, ధృవీకరణ దరఖాస్తులను చివరి క్ష‌ణంలో పంపకూడదని బోర్డు పేర్కొంది.

సినిమాల స‌ర్టిఫికేష‌న్ ప్రాసెస్ లో స‌ర్టిఫికెట్ ని ధృవీకరించేటప్పుడు బోర్డు ఏం చేస్తుందో కూడా ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. తక్షణమే అమలులోకి వచ్చేలా ఎలాంటి భౌతిక పత్రాలను బోర్డు ఆమోదించబోదని ఈ ప్రకటన వెల్లడించింది. ధృవపత్రాలు కూడా దరఖాస్తుదారుకు ఇమెయిల్ ద్వారా అందుతాయి. డిమాండ్ చేస్తే మాత్రమే ఫిజికల్ సర్టిఫికేట్ అందిస్తాం అని తెలిపారు.

విశాల్ న‌టించిన మార్క్ ఆంటోని హిందీ వెర్షన్‌కు U/A సర్టిఫికేట్ పొందడం కోసం CBFCపై చేసిన అవినీతి ఆరోపణలను సీరియ‌స్ గా తీసుకున్నాం. మేము IFTDA వద్ద సిబిఎఫ్‌సి అధికారులపై వచ్చిన ఈ ఆరోపణలపై ఆందోళన చెందుతున్నాం. అందువల్ల ఈ ఫిర్యాదుపై సిబిఐ విచారణకు మేము డిమాండ్ చేస్తున్నామని సీబీఎఫ్ సి ఛీఫ్ జోషి వ్యాఖ్యానించ‌డం ఇక్క‌డ గ‌మ‌నించ‌ద‌గిన‌ది.

దీనిపై విశాల్ కూడా ప్ర‌తిస్పందించారు. విశాల్ మాట్లాడుతూ-''అతని(జోషి) మాటను బట్టి సరైన సమయంలో ఏ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. CBFC వారు సర్టిఫికేట్‌ను కొరియర్ చేస్తే అది మాకు ఎప్ప‌టికి అందుతుంది? మల్టీప్లెక్స్‌లు టికెట్ విండోలో బుకింగ్‌లను ఎలా తెరుస్తాయి? ప్రతి నిర్మాత ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీల గురించి తెల‌య‌దా?'' అని ఘాటుగా ప్ర‌శ్నించారు.

ఏది ఏమైనా తాజా ఉదంతంతో సీబీఎఫ్‌సి అవినీతిపై దేశంలో పెద్ద డిబేట్ ప్రారంభం కావ‌డానికి ద‌క్షిణాది హీరో విశాల్ కార‌కుడు అయ్యాడు. దీనిపై డిబేట్ ప్రారంభమైనందుకు విశాల్ సంతోషిస్తున్నాన‌ని అన్నారు. అయితే ఇది ప్రారంభం మాత్ర‌మే.. చర్చ మొదలైంది. మన దేశంలో అవినీతిపై మరింత అంకితభావంతో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దాని మూలకారణాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News