బిగ్ ఫైట్: మెగా Vs అక్కినేని Vs నందమూరి!

రాబోయే దసరాకి మెగా Vs అక్కినేని Vs నందమూరి వార్ జరగబోతోందనే టాక్ నడుస్తోంది.

Update: 2024-03-05 10:00 GMT

మెగా, నందమూరి, అక్కినేని.. టాలీవుడ్ లో ఉన్న పెద్ద సినీ కుటుంబాలు. ఈ మూడు ఫ్యామిలీల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. వారి మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉన్నా, సినిమాల విషయాలకు వచ్చే సరికి మాత్రం యుద్ధ వాతావరణం క్రియేట్ అవుతుంది. గతంలో వీరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటే అభిమానుల మధ్య ఓ రేంజ్ లో ఫ్యాన్ వార్స్ జరిగేవి. కానీ ఇటీవల కాలంలో ఈ మూడు ఫ్యామిలీల హీరోల సినిమాలు ఒకే సీజన్ లో విడుదలైన సందర్భాలు లేవు. కానీ ఈ ఏడాదిలో అలాంటి అరుదైన బాక్సాఫీస్ ఫైట్ ను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే దసరాకి మెగా Vs అక్కినేని Vs నందమూరి వార్ జరగబోతోందనే టాక్ నడుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ "they Call him OG". సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను RRR నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 సెప్టెబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 'అత్తారింటికి దారేది' రిలీజ్ డేట్ కు కచ్ఛితంగా రావాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ సెట్స్ లో అడుగుపెడితే.. వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దసరా వరకూ బాక్సాఫీసు వసూళ్లు కొల్లగొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్న OG కి 'దేవర' నుంచి పోటీ ఎదురు కాబోతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ '''. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. దీని మొదటి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. RRR తర్వాత తారక్ నుంచి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాకపోతే దసరా సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకోవాలనుకున్న దేవర పార్ట్-1కు సోలో రిలీజ్ దొరికేలా కనిపించడం లేదు. ఎందుకంటే పోటీగా ఒక్కరోజు గ్యాప్ తో 'తండేల్' వస్తున్నాడు.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ''తండేల్''. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాబోయే దసరా పండక్కి విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్లు ఇటీవలే దర్శకుడు స్పష్టం చేశారు. దీని కోసం అక్టోబరు 11వ తేదీని లాక్ చేస్తున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లోకి నందమూరి బాలకృష్ణ కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో నటసింహం నటిస్తోన్న 'NBK 109' చిత్రాన్ని 2024 విజయ దశమికే విడుదల చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భావిస్తున్నారట. OG వచ్చిన వారం తర్వాత, 'దేవర' పార్ట్ 1 కంటే వారం ముందు బాలయ్య సినిమాని బరిలో నిలపాలని చూస్తున్నారట. ఈ మేరకు అక్టోబర్ 3వ తేదీని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఫెస్టివల్ సీజన్ కాబట్టి రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే బాబాయ్ - అబ్బాయ్ బాక్సాఫీసు బరిలో పోటీ పడతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో ఒక్కరు వచ్చినా, ఇద్దరూ కలిసొచ్చేనా ఈసారి దసరాకి మాత్రం మెగా - అక్కినేని - నందమూరి హీరోల మధ్య క్లాష్ అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇందులో ఎవరు ఎవరిపై పైచెయ్యి సాధిస్తారనేది పక్కన పెడితే, ఈ విజయ దశమి పోరు మాత్రం చాలా రసవత్తరంగా మారే అవకాశం వుంది. ఈ ఫైట్ కోసం టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News