హరిహర వీరమల్లు.. ఒకేసారి 500 మందితో..
ముఖ్యంగా, ఆగస్టు 14వ తేదీ నుంచి చిత్రబృందం భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి పాన్ ఇండియా చిత్రం “హరి హర వీర మల్లు” షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అనుకోని కారణాల వలన కొన్ని రోజులు షూటింగ్ కు విరామం ఏర్పడినా, ఇప్పుడు షూటింగ్ పనులు ట్రాక్ లోకి వచ్చాయి. ముఖ్యంగా, ఆగస్టు 14వ తేదీ నుంచి చిత్రబృందం భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించింది.
ఈ వార్ సన్నివేశాలు ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ స్టంట్ సిల్వా ఆధ్వర్యంలో తెరకెక్కుతుండగా, దాదాపు 400-500 మంది ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల్లో ఈ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం, ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
ఈ యుద్ధ సన్నివేశాలను అత్యంత వైభవంగా తెరకెక్కించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ తొలిసారి ఒక చారిత్రక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో, ఆయనను కొత్త అవతారంలో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని కలిగించనున్నారని తెలుస్తోంది. కాగా, ఇటీవల జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలైన టీజర్ కు అభిమానులు, సినీ ప్రేమికుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ సాగా లో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ వంటి తారాగణం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
అగ్రచాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రముఖ ఆర్ట్ డైరెక్టరర్ థోటా తరణి కళాదర్శకత్వం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. లెజెండరీ నిర్మాత ఏ ఎం రత్నం "మెగా సూర్య ప్రొడక్షన్స్" బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
చారిత్రక నేపథ్యంతో వస్తున్న "హరి హర వీర మల్లు పార్ట్-1: స్వోర్డ్ vs స్పిరిట్" త్వరలోనే తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రూపొందిస్తుండటంతో, ఈ సినిమా అన్ని భాషలలో పెద్ద విజయం సాధించబోతోందని సినీ పరిశ్రమలో ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ఇక సినిమాను ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించే లేవు. ఇక వచ్చే ఏడాది రిలీజ్ కావచ్చని సమాచారం.