యాత్ర 2.. వైయస్ జగన్ సిద్ధమయ్యాడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ యాత్ర.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ యాత్ర. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు యాత్ర 2 తెరకెక్కుతోంది. ఈ మూవీలో వైఎస్ఆర్ కుమారుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని చూపించబోతున్నారు.
అయితే గురువారం (డిసెంబర్ 21) వైఎస్ జగన్మెహన్ రెడ్డి బర్త్‌డేను పురస్కరించుకుని యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని' అని పవర్‌ఫుల్ డైలాగ్‌ను పోస్టర్‌లో యాడ్ చేశారు. పోస్ట్లో వైఎస్ఆర్తోపాటు వైఎస్ జగన్ పాత్ర కూడా ఉంది.
"ఇది అతడి ముగింపు అని వారు భావించారు. ఇది ప్రారంభం మాత్రమే అని అతడి తెలుసు!.. వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా లెన్స్ ద్వారా మీ కథను ప్రపంచానికి చెప్పడానికి వేచి ఉండలేం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర-2 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాం" అంటూ మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌ను చూసి వైఎస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
యాత్ర 2 సినిమా వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నుంచి మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను ముఖ్యంగా చూపించబోతున్నట్లు సమాచారం. పాదయాత్రతో మొదలై, సీఎం అయ్యే వరకు ఈ సినిమా కథ కొనసాగనుందట.
ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు. 'యాత్ర' ఫేమ్ మహీ వీ రాఘవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న యాత్ర 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాత్ర-1 రిలీజైన రోజే యాత్ర-2 కూడా విడుదల కానుంది.
గత కొంత కాలంగా తెలుగు చిత్రసీమలో పలువురు సినీ తారలతో పాటు క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాంటి వాటిలో యాత్ర ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2019 ఎన్నికల ముందు విడుదల అయ్యింది. అయితే యాత్ర మంచి సక్సెస్ అవ్వడంతో ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మహి వీ రాఘవ్.