వైసీపీ మేయర్ కుర్చీ కి కౌంట్ డౌన్ స్టార్ట్ !
వైసీపీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టడం కాదు నెగ్గడానికి అవసరమైన సంఖ్యాబలం కూటమి సమకూర్చుకుంది.;
అంతా అనుకున్నట్లే జరుగుతోంది. ముందు వైసీపీ నుంచి కార్పోరేటర్లు పెద్ద ఎత్తున టీడీపీ కూటమిలో చేరారు. వైసీపీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టడం కాదు నెగ్గడానికి అవసరమైన సంఖ్యాబలం కూటమి సమకూర్చుకుంది. సరిగ్గా మార్చి 18 నాటికి నాలుగేళ్ళు వైసీపీ మేయర్ పదవీ కాలం పూర్తి చేశారు.
దాంతో చట్టబద్ధమైన అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. ఇక మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు అని అన్ని లెక్కలూ వేసుకున్న మీదట కూటమి తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసింది. పూర్తి స్థాయి కమిషనర్ లేనందువల ఇక ఇపుడు జీవీఎంసీ వ్యవహారాలను చూస్తున్న జిల్లా కలెక్టర్ ని శనివారం కలసి టీడీపీ కూటమి నేతలు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నోటీసులను అందచేశారు.
దాంతో మేయర్ మీద అవిశ్వాసానికి సంబంధించి కీలక ఘట్టం ఒకటి పూర్తి అయింది అని భావిస్తున్నారు. కలెక్టర్ కూటమి నేతలు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని అవిశ్వాస తీర్మానం మీద చర్చకు ఒక రోజుని కేటాయిస్తారు. ఆ రోజున చూస్తే ఎవరి బలాలు ఏమిటి అన్నవి తేలిపోతాయి.
ఇపుడు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే 2021లో వైసీపీ గెలిచిన 59 కార్పోరేటర్లలో ఏకంగా 28 మందిని కూటమికి కోల్పోయింది. అంటే అచ్చంగా వైసీపీకి ఉన్న సంఖ్య 31 అని చెబుతున్నారు. అయితే ఇందులో కూడా స్పష్టత ఏమీ లేదు. ఈ నంబర్ కూడా ఇంకా బాగా తగ్గవచ్చు అని అంటున్నారు.
ఈ రోజుకు చూస్తే కనుక విశాఖ కార్పోరేషన్ లో వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోయింది అని అంటున్నారు. అంటే మైనారిటీలో ఉంది అని అంటున్నారు. విశాఖ కార్పోరేషన్ లో మొత్తం కార్పోరేటర్లు 99. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుని ఆ సంఖ్య 112కి చేరుకుంటుంది. అంటే మేయర్ గా ఎవరు ఉండాలన్నా మ్యాజిక్ ఫిగర్ 57 మంది కచ్చితంగా ఉండాలి.
వైసీపీకి గెలిచినపుడు 59 మంది ఉన్నారు. కానీ ఇపుడు ఆ నంబర్ లేదు. ఆ మాటకు వస్తే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా మంది కార్పోరేటర్లు కూటమి వైపుగా వచ్చారు. అలా చూస్తే 40 నుంచి 45 దగ్గరే వైసీపీ బలం ఉంది. కానీ నాలుగేళ్ళ కాల పరిమితి ఉండడంతో అవిశ్వాసానికి కూటమి ముందుకు పోలేదు. ఇపుడు ఎటూ అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి రంగంలోకి దిగిపోయింది.
ఇక చూస్తే కనుక వచ్చే వారంలోనే మేయర్ మీద అవిశ్వాసం మీద చర్చకు జీవీంసీ ప్రత్యేకంగా సమావేశం కావచ్చు అని అంటున్నారు. బలాబలాలను బట్టి చూస్తే కూటమికే మేయర్ పీఠం అని చెప్పాల్సి ఉంది. మరి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప విశాఖ మేయర్ పీఠం వైసీపీ నుంచి చేజారి టీడీపీ కూటమికి దక్కబోతోంది అన్నది నిజమంటున్నారు.