రాజకీయాలే శాపమా? ఆ ఇద్దరు నటులు ఇక ఇంతేనా?
ఈ సందర్భంగా కోలీవుడ్ లోను ఇలాంటి బాపతు కేసు గురించి చర్చ మొదలైంది. తమిళ సినీపరిశ్రమ అగ్ర కమెడియన్ గా దశాబ్ధాల పాటు ఏలిన ప్రముఖుడు వడివేలు.;
ఇటీవల కొంతకాలంగా టాలీవుడ్ లో ఒక ప్రముఖుడి జైలు జీవితం డిబేటబుల్ గా మారింది. రచయితగా, నటుడిగా అత్యుత్తమ ప్రతిభతో ఆకట్టుకున్న పోసాని కృష్ణ మురళి రాజకీయాల కారణంగా తన ప్రశాంతమైన బంగారు భవితవ్యాన్ని కాలదన్నుకున్నాడనేది దీని సారాంశం. సినీపరిశ్రమ దిగ్గజాలతో కలిసి సమాంతరంగా గౌరవం అందుకున్న పోసాని గత కొంతకాలంగా జైలులో నరకం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్థితిలో ఆయనను చూస్తున్న సన్నిహితులు చాలా ఆవేదన కనబరుస్తున్నారు. అతడికి బెయిల్ వచ్చినట్టే వచ్చినా బయటికి రాలేని పరిస్థితి. మొత్తం 19 కేసులు.. ఇవన్నీ రాజకీయాలతో ముడిపడినవి. లోనికి వెళ్లడమే కానీ బయటకు రానంతగా అతడిని కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అతడు మేటి రచయితగా, అద్భుత నటుడిగా బాగా సంపాదించుకుంటున్న సమయంలో ఇదేంటి నాథా? అంటూ అభిమానులు కలత చెందుతున్నారు.
ఈ సందర్భంగా కోలీవుడ్ లోను ఇలాంటి బాపతు కేసు గురించి చర్చ మొదలైంది. తమిళ సినీపరిశ్రమ అగ్ర కమెడియన్ గా దశాబ్ధాల పాటు ఏలిన ప్రముఖుడు వడివేలు. ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో సమానంగా గౌరవం అందుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన సినీకెరీర్ ని రాజకీయాలు మలుపు తిప్పాయి.
వడివేలు సినీ కెరీర్‌ను దెబ్బతీసిన రాజకీయ సంఘటనలు ఏమిటి? అన్నది పరిశీలిస్తే..2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు, వడివేలు డిఎంకె తరపున ప్రచారం చేశారు. అనేక వ్యాపారాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం, తమ బ్యానర్‌లో సినిమాలు నిర్మించడం, ప్రతి త్రైమాసికానికి ఒక సినిమా విడుదల చేయడం, ఏ సినిమా ఏ థియేటర్‌లో విడుదల కావాలో నిర్ణయించడం.. మరిన్ని తప్పుడు కారణాలతో అధికార డిఎంకెకు చెడ్డ పేరు వచ్చింది. తరచుగా విద్యుత్ కోతలు విధించడం వల్ల తమిళనాడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రచారం కోసం నటీనటులకు భారీగా డబ్బు ముట్టజెప్పారు. ప్రచారంలో డిఎంకె సినీప్రముఖులను ఆకర్షించింది. ఆ సమయంలో వడివేలు అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా భారీ డీల్ కుదుర్చుకుని డిఎంకేకి ప్రచారం చేసాడు.
వడివేలుపై గతంలో నిర్మాతల మండలి ఫిర్యాదు చేయడం వల్ల విజయకాంత్‌పై వ్యక్తిగత ద్వేషం ఉంది. దీనిని నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విజయ్‌కాంత్ తనదైన శైలిలో డీల్ చేసాడు. వడివేలును అణగదొక్కాడు. విజయకాంత్ డిఎండికె ఎడిఎంకెతో పొత్తు పెట్టుకున్నారు. ఓసారి ఎన్నికల ప్రచారంలో, వడివేలు విజయకాంత్‌ను ఎగతాళి చేస్తూ, ``ఉన్నాలే నిక్కవే ముడియలయే, నీ ఎన్న కలైజ్ఞర్ ఎధిర్తు జెయ్య్కా పోరా`` (నువ్వు నిలబడలేవు, కరుణానిధిపై పోటీ చేసి ఏం చేస్తావు) అంటూ ఎగతాళి చేసారు. తాగుడుకు అలవాటు పడిన విజయ్ కాంత్ పై సెటైర్ ఇది. విజయకాంత్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే వడివేలు ఈ కౌంటర్ వేసాడు. ఆ వ్యాఖ్య స్పష్టంగా ఉండటంతో విజయ్ కాంత్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎన్నికల ప్రచారంలో వడివేలు విజయకాంత్‌ను ఎగతాళి చేయడం పెద్ద చర్చగా మారింది.
2011 అసెంబ్లీ ఎన్నికల్లో, డిఎంకె అధికారం నుండి తుడిచిపెట్టుకుపోయింది. ఎడిఎంకె, డిఎండికె కూటమి 203 సీట్లు గెలుచుకుంది. డిఎంకె 31 ప్లస్ సీట్లలో మాత్రమే గెలిచింది. పార్టీ అధికారం నుండి వైదొలిగింది. డిఎంకె (23 సీట్లు) కంటే ఎక్కువ సీట్లతో (29 సీట్లు) ప్రతిపక్షంగా మారింది.. రెండవ స్థానానికి పరిమితమైంది.
అప్పటి నుండి ఏ నిర్మాత కూడా వడివేలును సినిమాకి ఎంపిక చేయలేదు. ఒప్పందాల్లేవ్. అతడిపై పరిశ్రమలో అనధికారిక నిషేధం అమలైంది. అతడి కామెడీ ట్రాక్ ఉన్న ఏ సినిమా విడుదల కాలేదు. అతడు 2014 -2015 లో ప్రధాన హీరోగా విడుదలైన రెండు సినిమాలు విఫలమయ్యాయి. 2021 లో డిఎంకే తిరిగి అధికారంలోకి వచ్చే వరకు అతడు ఒక దశాబ్దం పాటు ఒక్క సినిమా కూడా లేకుండా ఖాళీగా కూర్చున్నాడు. 2011 లో డిఎంకే తమ ప్రచారం కోసం వడివేలును ఉపయోగించుకుంది. అది వడివేలు కెరీర్ ని దెబ్బ తీసింది. 2021 తర్వాత డీఎంకే కొన్ని సినిమాలు నిర్మించడం ద్వారా వడివేలుకు మద్దతు ఇస్తోంది. అతడి కెరీర్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఇవేవీ ఫలించలేదు. అలా వడివేలు కెరీర్ కూడా సమాప్తమైందన్న చర్చా తమిళనాట సాగుతోంది. ఇద్దరు పెద్ద నటులు రాజకీయాల్లో వేలు పెట్టడం ద్వారా సినీకెరీర్ పరంగా చాలా నష్టపోయారన్న చర్చా వేడెక్కిస్తోంది.