టమాటా మోత చెల్లు.. కేజీ రూ.10 పలక లేదు
టమాటా ధర రికార్డు స్థాయిలో పెరిగిన వేళ.. ఆ పంటను పండించేందుకు రైతులు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్ లోకి భారీగా పంట వచ్చేస్తోంది
మొన్నటివరకు కాసుల కురిపించిన టమాటా ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆ మధ్యన ఆకాశానికి అంటిన టమాటా రికార్డు ధరలకు అమ్ముడు కావటం తెలిసిందే. రిటైల్ మార్కెట్ లో కేజీ టమాటా రూ.వంద దాటేసి.. డబుల్ సెంచరీ కొట్టేయటం.. దానికి మించి దూసుకెళ్లటం తెలిసిందే. దీంతో.. టమాటాతో వంటలు చేసే వారు బంద్ చేయటం కనిపించింది. ఈ ధరాభారం మరికొంతకాలం సాగుతుందని అంచనా వేసినా.. అలాంటిదేమీ లేకపోవటం గమనార్హం.
టమాటా ధర రికార్డు స్థాయిలో పెరిగిన వేళ.. ఆ పంటను పండించేందుకు రైతులు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్ లోకి భారీగా పంట వచ్చేస్తోంది. దీంతో.. డిమాండ్ - సప్లై సూత్రంలో భాగంగా అవసరానికి మించి వస్తున్న టమాటా పంట పుణ్యమా అని.. మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా టమాటా ధరలు భారీగా పడిపోతున్నాయి.
గడిచిన రెండు నెలలుగా టమాటా ధర మోత పుట్టించి.. కొనే వారికి కన్నీళ్లు తెప్పిస్తే.. తాజాగా హోల్ సేల్ మార్కెట్ లో రైతులకు పలుకుతున్న ధరకు వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా ధర భారీగా పతనమైంది. శుక్రవారం మార్కెట్ కు వచ్చిన టమాటా పంటతో కళకళలాడినా.. కేజీకి రూ.10 చొప్పున కూడా ధర పలకకపోవటంతో రైతులకు కన్నీళ్లు ఒక్కటే అన్నట్లుగా పరిస్థితి మారింది.
యార్డులో టమాటా కొనుగోల్లు శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో మొదలుకాగా.. మొదటిరోజున సుమారు 10 టన్నుల సరకు మార్కెట్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో క్వింటాలు (వంద కేజీలు) ఒక్కొక్క బాక్సు కేవలం రూ.వెయ్యి కూడా పలకని దుస్థితి. దీంతో.. తమకు దక్కిన ధరలకు సదరు రైతులు ఊసురుమంటున్నారు. అంచనాలకు మించిన పంట దిగుబడితో ధరలు భారీగా పడిపోయాయి. తాజా పరిణామాలతో టమాటా ధరలు తగ్గిపోవటంతో.. సగటు వినియోగదారుడికి సైతం రిలీఫ్ గా మారుతుందని చెప్పక తప్పదు.