ఒక్కరే సంతానంపై తాజా అధ్యయనంలో కీలక విషయాలు!!

ఒక్క బిడ్డను సక్రమంగా పెంచి, అన్నీ సమకూర్చ గలిగితే చాలు అన్నట్లుగా కొంతమంది భావిస్తున్నారు.

Update: 2024-10-01 17:30 GMT

ఇటీవల కాలంలో చాలా మంది దంపతులు ఒక్క బిడ్డతోనే ఆపేస్తున్నారు! ఈ రోజుల్లో ఉన్న ఒక్క బిడ్డను సక్రమంగా పెంచి, అన్నీ సమకూర్చ గలిగితే చాలు అన్నట్లుగా కొంతమంది భావిస్తున్నారు. పెరిగిన ఖర్చులు, ఫీజులు మొదలైన కారణాలతో ఒకరు ముద్దు మరొకరు వద్దు అని ఫిక్సైపోతున్నారు! ఈ సమయంలో తాజాగా ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అవును... ఒక్కరే సంతానం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే... ఇలా ఒక్కరే సంతానమైతే గారాబం ఎక్కువైపోతుందని, అది ఇతర సమస్యలకు దారి తీస్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే... తాజాగా వెలువడిన అధ్యయనాలు మాత్రం ఈ అభిప్రాయానికి పూర్తి భిన్నంగా చెబుతుండటం గమనార్హం.

ఇందులో భాగంగా... సంతానం ఒక్కరైన పిల్లలే సంతోషంగానూ, ఆరోగ్యంగానూ ఉంటారంటూ తాజా అధ్యయనాలు కీలక విషయాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా తోబుట్టువులున్న పిల్లలు, ఒక్కరే ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యాలను పోల్చుతూ చైనాలో ఓ అధ్యయనం చేశారు.

2.4 లక్షల మందితో చేసిన 113 అధ్యయనాల డేటాను తీసుకున్నట్లు చైనాలోని మకావు యూనివర్శిటీ ఈ పరిశోధన చేసింది. ఇందులో... కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలుంటే వారికి మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు అధికంగా ఉందని ఈ అధ్యయనంలో తేలిందని తెలిపింది! ఒత్తిడి, ఆందోళన, ఓసీడీ వంటివి ఒక్కరే ఉన్న పిల్లలో తక్కువగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.

అమెరికాలో 29 ఏళ్ల వయసున్న 3221 మందిపైన చేసిన మరో అధ్యయనంలోనూ ఇదే విషయం తేలిందని అంటున్నారు. ఒక్కరే ఉన్న పిల్లలు.. తోబుట్టువులున్న పిల్లలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారని అధ్యయనం చెబుతోంది. తల్లితండ్రులు వీరికి ఎక్కువ సమయం కేటాయించడమే దీనికి కారణమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు!

Tags:    

Similar News